https://oktelugu.com/

Cabinet Expansion : కేంద్ర కేబినెట్ ప్రక్షాళన.. ఏపీ, తెలంగాణ చీఫ్ లు కూడా.. మోడీ-షా సంచలనం?

ఏపీ రాజకీయాల విషయానికి వస్తే సోము వీర్రాజును పక్కకు తప్పిస్తారని తెలుస్తోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో బీజేపీ బలం పరిమితం. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ బీజేపీని కలుపుకెళ్లాలని యోచనలో ఉన్నారు.

Written By: , Updated On : June 29, 2023 / 11:27 PM IST
Follow us on

Cabinet Expansion : బీజేపీ ప్రక్షాళనకు మోదీ, షా ద్వయం నడుం బిగించారా? కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేయనున్నారా? కేబినెట్ లో సమూల మార్పులు తీసుకోనున్నారా? తెలుగు రాష్ట్రాల్లో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారా? నాయకత్వాలను మార్చనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్నపరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గత రాత్రి ప్రధాని మోదీ నివాసంలో హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలంటే తీసుకోబోయే కఠిన నిర్ణయాలపై చర్చించారు.

ముందుగా కేబినెట్ లో సమూళ ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎన్నికలకు ఏడాది వ్యవధి ఉన్న నేపథ్యంలో కళంకిత మంత్రులకు ఉద్వాసన పలకునున్నట్టు తెలుస్తోంది. దేశ ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మంత్రివర్గంలో అధిక ప్రాతినిధ్యం కల్పించాలని.. తద్వారా సెమిఫైనల్ గా భావించి అద్భుత విజయాలను సొంతం చేసుకొవాలని డిసైడయినట్టు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత డీలాపడిన పార్టీ వర్గాల్లో ధైర్యం నింపాలని స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

పనిలో పనిగా తెలుగు రాష్ట్రాల విషయంలో కీలక నిర్ణయాలు దిశగా అడుగులేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. ఇక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు. ఆయన పదవీకాలం ఈపాటికే పూర్తయ్యింది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన మార్పు అనివార్యంగా మారినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించకూడదు అన్న నిబంధన బీజేపీలో ఉంది. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర సారధ్య బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారని.. ఈటలను ప్రచార బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఏపీ రాజకీయాల విషయానికి వస్తే సోము వీర్రాజును పక్కకు తప్పిస్తారని తెలుస్తోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో బీజేపీ బలం పరిమితం. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ బీజేపీని కలుపుకెళ్లాలని యోచనలో ఉన్నారు. అయితే బీజేపీలో వైసీపీ అనుకూల వర్గం సైతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి కట్టే విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మరోవైపు సోము వీర్రాజును మార్చి..ఆ స్థానంలో సత్యకుమార్ ను తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఏపీ విషయంలో హైకమాండ్ గుంభనంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ మాదిరిగా ఏ విషయాలను బయటపెట్టడం లేదు. తెలంగాణ మార్పుల తరువాతే ఏపీలో హైకమాండ్ తమ చర్యలను ప్రారంభించే అవకాశముంది.