https://oktelugu.com/

Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రం యూటర్న్‌.. మెస్సేజ్‌ డిలీట్‌తో గందరగోళం!

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో– మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించిందనే విషయాన్ని తొలుత ప్రకటించింది ఆయనే.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 19, 2023 4:04 pm
    Women Reservation Bill
    Follow us on

    Women’s Reservation Bill: ప్రతిష్టాత్మకమైన మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ నూతన భవనంలో ఆమోదించి చరిత్ర సృష్టించాలనుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నట్టే కనిపిస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు తొలుత వార్తలొచ్చినప్పటికీ.. అది నిజం కాదని తెలుస్తోంది.

    ట్వీట్‌ డిలీట్‌..
    అదెలా అంటే.. దీనికి కారణం లేకపోలేదు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదించినట్లు వెల్లడించిన ట్వీట్‌ను కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్, పరిశ్రమలు, జల్‌శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ డిలేట్‌ చేశారు. దీన్ని పోస్ట్‌ చేసిన ఓ గంట తరువాత ఈ సమాచారాన్ని తన ఎక్స్‌ ఖాతా నుంచి తొలగించారు. దీంతో బిల్లుపై కేంద్రం యూటర్న్‌ తీసుకుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    మొదట తెలిపింది ఆయనే..
    ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో– మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించిందనే విషయాన్ని తొలుత ప్రకటించింది ఆయనే. ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదం పొందిందని, ఒక్క మోదీ ప్రభుత్వం మాత్రమే ఇలాంటి నిర్ణయాలను తీసుకోగలుగుతుంది’ అని ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. మోదీకి శుభాకాంక్షలూ తెలిపారు. ఆ తరువాత ఈ పోస్ట్‌ను ఆయన డిలీట్‌ చేశారు.

    అధికారిక ప్రకటన లేదు..
    దీని తరువాత మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, కేంద్ర కేబినెట్‌ సెక్రెటేరియట్‌ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

    అందుకే డిలీట్‌ చేశారా..
    అయితే పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించొద్దనే నిబంధన ఉంది. అందుకే సోమవారం(సెప్టెంబర్‌ 18న) సాయంత్రం పాత పార్లమెంటు భవనంలో చివరి క్యాబినెట్‌ సమావేశం నిర్వహించి తీసుకున్న నిర్ణయాలను మీడియాకు తెలుపలేదు. కానీ కేంద్ర మంత్రి మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ట్వీట్‌ చేశారు. ఇది మీడియాకు లీక్‌ అయింది. దీంతో పొరపాటును గుర్తించి ట్వీట్‌ డిలీట్‌ చేసి ఉంటారని తెలుస్తోంది.

    ఏది ఏమైనా బిల్లు ఆమోదం పొందిందా? లేదా? అనే విషయం గందరగోళం నెలకొంది. బిల్లు ఆమోదంపై ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటిస్తారని, అప్పటివరకు దీన్ని పక్కన పెట్టినట్టేనని చెబుతున్నారు.