
మైనింగ్ అక్రమాల కేసు వెంటాడుతున్న గాలి జనార్దన్ రెడ్డికి.. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒక విషయంలో పోలిక తెస్తున్నారు కొందరు. వీరిద్దరి విషయంలో సీబీఐ కాస్త భిన్నంగా వ్యవహరిస్తోందని అభిప్రాయ పడుతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బెయిల్ రద్దు చేయాలా? కొనసాగించాలా? అనే విషయంలో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఇందులో సీబీఐ ఏం చెప్పిందంటే.. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఆ విధంగా బెయిల్ రద్దు విషయంలో నిర్ణయాన్ని కోర్టుకే వదిలేసింది సీబీఐ. తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విషయంలోనూ ఇదేవిధంగా స్పందించింది. శుక్రవారం (ఆగస్టు 13) కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా.. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసి సీబీఐ.. విజయసాయి బెయిల్ రద్దు విషయంలో మెరిట్ ను బట్టి నిర్ణయం తీసుకోవాలని కోరింది.
అయితే.. గాలి జనార్దన్ రెడ్డి విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనకు బెయిల్ ఇచ్చినప్పటికీ.. అందులో పలు షరతులు ఉన్నాయి. అందులో బళ్లారికి వెళ్లకూడదనే రూల్ కూడా ఉంది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. కోర్టు అనుమతి తీసుకుని మాత్రమే వెళ్లాలి. ఈ విషయంలో తనకు సడలింపు ఇవ్వాలని పలుమార్లు ఆయన కోర్టును ఆశ్రయించారు. కానీ.. ఫలితం రాలేదు.
ఇప్పుడు మరోసారి కూడా సుప్రీం కోర్టులో ఈ మేరకు ప్రయత్నం చేయబోతున్నారు. బెయిల్ షరతులను సడలించాలని కోరేందుకు చూస్తున్నారు. అయితే.. సీబీఐ మాత్రం ససేమిరా అని వాదిస్తోంది. ఆయన బళ్లారి వెళ్లడం జరిగితే.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సీబీఐ చెబుతోంది. అందువల్ల ఆయన బెయిల్ షరతులను సడలించొద్దని బలంగా కోరుతోంది సీబీఐ.
సరిగ్గా.. ఈ విషయం దగ్గరనే జగన్ మోహన్ రెడ్డికి, గాలి జనార్ధన్ రెడ్డికి మధ్య పోలిక తెస్తున్నారు కొందరు. జగన్, విజయసాయి విషయంలో ఒకలా వ్యవహరిస్తున్న సీబీఐ.. మరి, గాలి విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తోందా? అని చర్చించుకుంటున్నారు.