Revanth Reddy- KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీజేపీని తక్కువగా అంచనా వేశారా.. సౌమ్యంగా కనిపిచే మోదీ–షా ద్వయం తాను ఏం చేసినా ఏమీ చేయలేరని భావించారా.. మోదీ–షా కంటే తానే బలవంతుడినని ఊహించుకున్నారా.. వాపు చూసుకుని బలుపనుకున్నారరా.. అందుకే వాళ్లతో కయ్యానికి కాలుదువవ్వారా అంటే అటు గులాబీ శ్రేణుల నుంచి ఇటు కాషాయ నేతల నుంచి అవుననే సమధానం వస్తోంది. తెలంగాణలో అన్ని పార్టీలపై తానే పెత్తనం చెలాస్తున్నా.. తనకు ఎదురు చెప్పే నాయకుడే లేడని ఇన్నాళ్లూ బావిలో కప్పలా ఆలోచించారు. ఈ క్రమంలోనే చెట్టుకింద సేద తీరుతున్న సింహాంపైకి చిట్టెలుక ఎక్కి సవారీ చేయాలనుకున్న చందంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీని గద్దె దించాలని భావించారు. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ దూతలు కొనాలని చూవారని కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. సిట్ ద్వారా బీజేపీ పెద్దలను అరెస్ట్ చేయాలని భావించారు. ఈమేరకు జాతీయ పార్టీ పెట్టుకున్నారు. కానీ అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడినట్లు కేసీఆర్ చేష్టలు ఉండగా, అన్నీ ఉన్నమ్మ ఓదిగి ఉన్నట్లు బీజేపీ సైలెంట్‌గా తన పనిచేసుకుపోతోంది.

రంగంలోకి సీబీఐ
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పదవులు, డబ్బులతో ప్రలోభపెట్టి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారని .. కేసీఆర్ ఆరోపిస్తున్నారు. పెద్ద కేసు కూడా అయింది. ఇప్పుడు ఆ కేసు అటూ ఇటూ తిరిగి మళ్లీ కేసీఆర్ దగ్గరకే వస్తోంది. ఫామ్‌హౌస్ కేసులో సాక్ష్యాలు కేసీఆర్ బయట పెట్టడంపై సీబీఐ ఆయననూ ప్రశ్నించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు, పదవులు కల్పించారని ఇది కూడా నేరమేనని.. దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కోర్టుకెళ్లాలని.. సీబీఐకీ ఫిర్యాదు చేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.
ఆ 12 మందిని ప్రలోభ పెట్టారు..
కాంగ్రెస్ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రలోభ పెట్టారని రేవంత్ ఆరోపిస్తున్నారు. అందుకే వారు బీఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొంటున్నారు. ఇందుకు వీరికి కేసీఆర్ పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు, పదవులు కల్పించారని అంటున్నారు. ఇది అవినీతికి పాల్పడటం.. ప్రలోభ పెట్టడమేనని చెబుతున్నారు. ఈ ఫిరాయింపులపైనా విచారణ జరిపించాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. మొదట హైకోర్టులో పిటిషన్ వేసి.. ఆ తర్వాత సీబీఐకి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరడం ద్వారా ఎమ్మెల్యేలకు ఎలాంటి లబ్ధి చేకూరిందో వివరాలను సేకరించి పెట్టారు. వాటన్నింటినీ ఆధారాలుగా హైకోర్టుకు, సీబీఐకి ఇవ్వాలనుకుంటున్నారు.
నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ వాళ్లే..
ఫామ్‌హౌస్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలే. ఈ ముగ్గురికి కేసీఆర్ ఆర్థి ప్రయోజనాలు కల్పించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ మంత్రి పదవి ఇర్చారని కాంగ్రెస్ పేర్కొంటోంది. ఇదంతా క్విడ్ ప్రో కో అని.. పార్టీ ఫిరాయింపులకు .. పదవులు ప్రలోభ పెట్టి ఇలా చేశారని రేవంత్ వాదన. ఫామ్ హౌస్ కేసును సీబీఐ పూర్తిగా ఇదే కోణంలో విచారణ చేయనున్న నేపథ్యంలో… 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకున్న తీరుపపై ఫిర్యాదు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. రెండు కేసుల్లో ప్రలోభాలే కీలకం. విచారణలో ప్రలోభాలకు గురైన వారు ఎవరైనా ఉంటే వారి పేర్లు కూడా బయటకు వస్తాయి. ఇదే అంశాన్ని రేవంత్‌రెడ్డి న్యాయపరంగా అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

రేవంత్ ప్లాన్ వర్కవుట్ అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరడంపైనా సీబీఐ ఆరా తీసే అవకాశం ఉంది. సబిత మంత్రిపదవి చేపట్టడం, 11 మందికి చేకూరిన ఇతర లబ్ధిపై కాంగ్రెస్ ఆధారాలు సమర్పిస్తే సీబీఐ అక్కడి నుంచే తవ్వకాలు మొదలు పెడుతుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.