AP Politics: ఏపీలో కులగణన హడావుడి నడుస్తోంది. దేశవ్యాప్తంగా కుల గణన జరుగుతుండడంతో .. తాము కూడా చేస్తామని ఏపీ ప్రభుత్వం బయలుదేరింది.అయితే అందులో నిజాయితీ ఉందా? అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు. అటు వైసిపి సర్కార్ చర్యలు సైతం అలానే ఉన్నాయి. కేవలం చేశాం కదా అన్నట్టు.. అందులో కూడా రాజకీయ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తుండడం విశేషం.రాజకీయ సమావేశాలు మాదిరిగా ఏర్పాటు చేసి కులగణన చేపడతామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఆ మధ్యన బీహార్ లో కులగణన చేపట్టారు. ఒకటికి రెండుసార్లు సంబంధిత వ్యక్తి ధ్రువీకరించిన తర్వాతే కుల గణనను నమోదు చేశారు. కేవలం మాన్యువల్ విధానంలోనే ఈ ప్రక్రియ కొనసాగింది. ఇది ముమ్మాటికీ ఉత్తమమైనది కూడా. కానీ ఏపీలో అలా చేయడం లేదు. కేవలం ఒక యాప్ నమ్ముకున్నారు. సచివాలయాల వద్ద సిబ్బందితో సర్వే చేస్తున్నారు. దీనికోసం వలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఈ తరహా సర్వేలు ప్రభుత్వం చేపట్టింది. వాటిని కూడా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.
కులగణన అనేది పారదర్శకంగా చేపట్టాల్సిన ప్రక్రియ. కానీ దీనిని ఒక రాజకీయ తంతుగా మార్చాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. ముందుగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సుల్లో వైసిపి ప్రజాప్రతినిధులు, వివిధ కుల కార్పొరేషన్లకు చెందిన డైరెక్టర్లుతో రాజకీయ ప్రసంగాలు ఇప్పించనున్నారు. ఈ సదస్సులు నిర్వహించడానికి యాంకర్లు, మోడరేటర్లను ముందుగానే గుర్తించి ఎంపిక చేయడం చాలా ముఖ్యమని కుల గణనకు సంబంధించి జీవోలో స్పష్టం చేశారు. ఇందుకోసం వీరికి నగదు పారితోషికం చెల్లించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం.
అయితే ఇది అసలు కుల గణన చేసే విధానమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. డిజిటల్ విధానం, మొబైల్ యాప్ ద్వారా కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే ఒక రకమైన తప్పిదంగా తెలుస్తోంది. ఒక్క కుల గణనే కాకుండా సామాజిక వర్గాలకు సంబంధించి విద్య, ఆర్థిక, తదితర అంశాలపై కూడా వివరాలు సమగ్రంగా సేకరించాల్సి ఉంటుంది. పూర్తిగా ఇంటింటికీ తిరిగి.. వివరాలు సేకరిస్తేనే సమగ్రంగా ఉంటుంది. లేకుంటే తప్పిదాలు జరిగే అవకాశం ఉంది. ఇంత దానికి కులగణన అంటూ హడావిడి చేయడం ఎందుకని జాతీయస్థాయిలో ఒక చర్చ జరుగుతోంది. కులగణన మాటున ముమ్మాటికీ ఇది రాజకీయ కార్యక్రమంగా మిగులుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.