Chandrababu: ఫ్లాష్ ఫ్లాష్.. తెలంగాణలో చంద్రబాబుపై కేసు నమోదు

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేయకపోవడమే ఉత్తమం అని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

Written By: Dharma, Updated On : November 2, 2023 3:57 pm

Chandrababu

Follow us on

Chandrababu: అవినీతి కేసుల్లో బెయిల్ దక్కడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు. బయటకు వచ్చిన చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు జనాలు. అయితే ఇప్పుడు ఆయనపై తెలంగాణలో కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఇప్పటికే ఏపీలో ఆపసోపాలు పడిన ఆయన.. అనారోగ్యం కారణాలతో మధ్యంతర బెయిల్ దక్కించుకున్నారు. వైద్యం చేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఆయనపై పోలీసు కేసు నమోదు కావడం గమనార్హం.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేయకపోవడమే ఉత్తమం అని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఇప్పుడు టిడిపి క్యాడర్ ప్రాపకం కోసం మిగతా పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు స్పందించాయి. సంఘీభావం వ్యక్తం చేశాయి. కొందరు నేతలు అయితే జగన్ తీరును తప్పు పట్టారు. అయితే ఇవన్నీ టిడిపి ఓట్ల కోసమేనని టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే హైదరాబాదులో అడుగుపెట్టిన చంద్రబాబుకు అక్కడ పోలీసులు ఝలక్ ఇచ్చారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో చాలా రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సైతం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. బెయిల్ పై విడుదలైన చంద్రబాబు విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి భారీ జన సందోహం నడుమ చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బేగంపేట పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు హైదరాబాద్ నగర టిడిపి జనరల్ సెక్రెటరీ జివిజి నాయుడు తదితరులపై కేసు నమోదయ్యింది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుపై తెలంగాణలో సైతం కేసులు నమోదయ్యాయని తెలుసుకున్న టిడిపి శ్రేణులు ఆందోళన గురయ్యాయి. అయితే అది ఎన్నికల కోడ్ ఉల్లంగించినందుకేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.