
సీఎం జగన్ కు తొలి నుంచి న్యాయస్థానాలు అచ్చిరావడం లేదు. జగన్ ముఖ్యమంత్రి కాకముందు నుంచే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. జగన్ కొన్నినెలలు జైలు జీవితం కూడా గడిపారు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక కూడా జగన్ కు న్యాయస్థానాలు ఎదురుదెబ్బలు తగలడం కంటిన్యూ అవుతూ పోతున్నాయి.
న్యాయస్థానాల్లో జగన్ సర్కార్ కు ఎదురైన ఎదురుదెబ్బలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదుర్కోలేదంటే నమ్మశక్యం కాదేమో. అంతలా సీఎం జగన్ కోర్టుల నుంచి మొట్టికాయలు ఎదుర్కొన్నారు. తాజాగా జగన్ సర్కార్ హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీతో విచారణ చేయించింది. అయితే దీనిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేసును సీబీఐకి అప్పగించింది.
రాష్ట్ర ప్రభుత్వం.. నేతలపై సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే జగన్ సర్కార్ వెంటనే చర్యలు తీసుకుంటోంది. అయితే గతంలోనే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 19మంది పేర్లతో న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. ఇందులో 9మందిపై మాత్రమే కేసు నమోదు చేయడంపై హైకోర్టు నిలదీసింది. మిగిలిన వారికి ప్రభుత్వం రక్షణగా ఉంటుందా? అంటూ ఘాటుగా స్పందించింది.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ కేసును సీఐడీ నుంచి సీబీఐ అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సీఐడీ కన్నా సీబీఐ తరహా సంస్థకు సాంకేతిక పరిజ్ఞానం.. తగిన వనరులు.. విభాగాలు ఉంటుందని.. అవసరమైతే ఇంటర్ పోల్ ను సంప్రదించడానికి వీలుంటుందని హైకోర్టు తెలిపింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న ఏజీ స్పందిస్తూ ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎనిమిది వారాల్లో హైకోర్టుకు పూర్తిగా అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జగన్ సర్కారుకు న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగలడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.