ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీధర్ ఈనాడు దినపత్రికకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో ఎన్నో రకాల వ్యాఖ్యానాలు.. విశ్లేషణలు వచ్చాయి. ఈనాడును ఎందుకు వదలాల్సి వచ్చింది? అనే విషయంలోనూ ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేశారు. మొత్తానికి రెండు రోజులపాటు శ్రీధర్ ఇష్యూ ఒక వార్త అయ్యింది. అయితే.. రెండో రోజుల క్రితమే ఆయన రాజీనామా చేసినప్పటికీ.. అధికారికంగా నిన్నటితో ఆయన ఈనాడు ప్రస్థానం ముగిసింది.
అయితే.. శ్రీధర్ రాజీనామా అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచీ.. అందరూ చేసిన ఆలోచన ఆయన ఎక్కడ చేరతారు అని. ప్రస్తుతం ఈనాడుకు పోటీగా ఉన్న ప్రముఖ దినపత్రిక ప్రారంభ సమయంలోనే శ్రీధర్ కు భారీ ఆఫర్ ఇచ్చింది. కానీ.. శ్రీధర్ వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి ఆ పత్రిక శ్రీధర్ కోసం చూస్తున్నట్టు సమాచారం. అంతేకాదు.. ప్రముఖ ఇంగ్లీష్ పేపర్ సైతం శ్రీధర్ కు భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో.. శ్రీధర్ ఏ సంస్థలో చేరుతారు? అనే చర్చ మొదలైంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీధర్ ఏ సంస్థలోనూ చేరడం లేదట. ఈ రెండు సంస్థల్లోనే కాదు.. ఇక మీదట ఏ మీడియా సంస్థలోనూ ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నారట. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఈనాడు సంస్థలో పనిచేసిన శ్రీధర్.. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారట. అదే సమయంలో.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
త్వరలో శ్రీధర్ ఒక స్కూల్ స్థాపించాలని చూస్తున్నారట. అది ఆర్ట్ స్కూల్. అంటే.. చిత్రలేఖనంపై ఆసక్తి గలవారికి శిక్షణ ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. విశ్రాంతి తీసుకుంటూ.. ఈ ఆర్ట్ స్కూల్ బాధ్యతలు చూసుకోవాలని భావిస్తున్నారట. దీంతోపాటు మరో పని కూడా చేయాలనుకుంటున్నారట. ఆయన చిత్రలేఖనంలో పీహెచ్ డీ కూడా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఆ కోరిక కూడా తీర్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.