TRS Party: పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసంతృప్తి జ్వాల ఎగిసిపడింది. శివసేన సీఎం ఉద్దవ్ ను కుర్చీ నుంచి దించే పని వేగంగా సాగుతోంది. తండ్రీకొడుకుల రాజకీయానికి విసిగి వేసారిన ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. మహారాష్ట్రలోనే కాదు.. తెలంగాణలోనూ ఇది ఇప్పటికే మొదలైంది. ఈటల రాజేందర్ తో బయటపడ్డ అసంతృప్తి టీఆర్ఎస్ లో నివురుగప్పిన నిప్పులా ఉంది. అది ఏ క్షణమైనా పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే కేసీఆర్, కేటీఆర్ టైం ఎంతో కాలం లేదన్న ప్రచారం సాగుతోంది. ఈ తండ్రీకొడుకులకు మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుందంటున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వార్ చూశాక.. తెలంగాణలోనూ మహారాష్ట్ర పరిస్థితులు పునరావృతం కావడం ఖాయమన్న అంచనాలు నెలకొంటున్నాయి.

మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అవుతుంది. అలాగే నాయకులు ఎక్కువైతే “కారు” మొరాయిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కారు పరిస్థితి కూడా ఇలానే ఉంది. కొల్లాపూర్ నుంచి మొదలుపెడితే అశ్వారావుపేట దాకా నేతల మధ్య లుకలుకలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు పరిస్థితి చేయి దాటి కేసులు పెట్టుకునే స్థాయి దాకా వెళ్తున్నాయి.

-కేటీఆర్ అనుచరులకు అధ్యక్ష పదవులు ఇచ్చినా ఎందుకిలా జరుగుతోంది
ఒకరిద్దరు మినహా 33 జిల్లాల్లో కేటీఆర్ అనుచరులకే అధ్యక్ష పదవి ఇచ్చారు. అయినప్పటికీ పార్టీలో విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వెళ్తూ వెళ్తూ అధిష్టానం పైన, కెసిఆర్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి ఒక నాయకుడు వెళ్తున్నప్పుడు విమర్శలు సర్వ సాధారణమైన ప్పటికీ.. తాటి వెంకటేశ్వర్లు చేసిన ఆరోపణలు సత్య దూరమైనవి కావు. పోడు భూములకు పట్టాలు ఇవ్వనందున తాను నిరసనగా పార్టీ నుంచి బయటకు వెళ్తున్నానని తాటి వెంకటేశ్వర్లు చెప్పడం గమనార్హం. వాస్తవానికి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అవసరమైతే నేను కుర్చీ వేసుకుని గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇస్తా అని కేసీఆర్ అన్నారు. మూడేళ్లు గడిచాక గిరిజనుల నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లు హడావిడి చేశారు. ఆ తర్వాత ఎక్కడ విషయం గొంగళి అక్కడే అన్నట్టుగా వదిలేశారు. దీంతో క్షేత్రస్థాయిలో గిరిజనుల నుంచి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రతిఘటన ఎదురవుతోంది. ఇక హైదరాబాద్లోనూ దివంగత పీజేఆర్ కూతురు విజయ రెడ్డి ఇటీవల టిఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం ఏం చేయలేకపోతోందని, దానికి నిరసనగానే తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

Also Read: iPhone : అద్భుతమే ఇదీ.. నదిలో పడిన 10 నెలల తర్వాత కూడా పనిచేస్తున్న ఐఫోన్
-కొల్లాపూర్ లో గరం గరం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ లో అధికార టీఆర్ఎస్ లోనే ఉప్పు నిప్పుగా వర్గాలు తయారయ్యాయి. నిన్నటికి నిన్న అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒకానొక దశలో జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ రావడంతో ఎమ్మెల్యే కూడా వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు అనేక అవకతవకలకు పాల్పడ్డారని, ఎల్ఐసి ద్వారా తీసుకున్న ఆరు కోట్ల రుణాన్ని ఎగ్గొట్టారని హర్షవర్ధన్ ఆరోపిస్తే.. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా హర్షవర్ధన్ ఆందోళనలు చేశారని, నిర్వాసితుల తో ప్రభుత్వం పై కేసులు వేయించారని కృష్ణారావు విమర్శలు చేశారు. అయితే ఇరు వర్గాలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం తో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో తాను ఎల్ఐసి నుంచి ఆరు కోట్ల రుణం తీసుకోలేదని బుకాయించిన జూపల్లి కృష్ణారావు.. నిన్నటి ప్రెస్ మీట్ లో రుణం తీసుకున్నట్టు దానిని కట్టినట్టు ఒప్పుకున్నారు. ఇక పాలమూరులో అసలు అవకతవకలు జరగలేదని, నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చామని చెప్పిన ప్రభుత్వం మాటలు.. హర్షవర్ధన్ కేసులతో బూటకమని మరోసారి తేలిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తి పోతున్నాయి. కాగా క్షేత్రస్థాయిలో ఇంత జరుగుతున్నా టిఆర్ఎస్ నాయకులు పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం. మరోవైపు గ్రేటర్లో ఆరుగురు కార్పొరేటర్లు, కొంతమంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని రేవంత్ రెడ్డి చెబుతుండడం గమనార్హం. వాస్తవానికి టిఆర్ఎస్ నాయకులు మా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలో వారు వస్తారని బండి సంజయ్ పదే పదే చెప్పిన అది కార్యరూపం దాల్చలేదు. కానీ రేవంత్రెడ్డి చెప్పకుండానే తమ పార్టీలోకి చేరికలను ఆహ్వానిస్తున్నారు.
Also Read: Sobhita Dhulipala: నాగచైతన్యతో డేటింగ్ వార్తలపై స్పందించిన శోభిత ధూళిపాళ