TDP Manifesto: చంద్రబాబు లేకుండా టిడిపి మేనిఫెస్టోను విడుదల చేయగలరా?

జగన్ వ్యూహాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది.

Written By: Dharma, Updated On : October 22, 2023 2:21 pm

TDP Manifesto

Follow us on

TDP Manifesto: చంద్రబాబు అరెస్ట్ తో జగన్ లక్ష్యం పూర్తయిందా? తన జైలు జీవితానికి చంద్రబాబే కారణమని భావించి ఆయనను జైల్లో పెట్టారా? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ముంగిట టిడిపి దూకుడును కళ్లెం వేసేందుకే ఈ నిర్ణయానికి వచ్చారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఆరు నెలలుగా టిడిపి యాక్టివిటీస్ పెరిగాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలుపుతో పార్టీలో ఒక రకమైన ఊపు వచ్చింది. దానిని కొనసాగిస్తూ చంద్రబాబు ప్రజల మధ్యకు వెళ్లారు. విశేష ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నించారు. కరెక్ట్ గా దీనిని అడ్డుకట్ట వేసేందుకే జగన్ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను తగ్గించగలిగారు.

జగన్ వ్యూహాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది. చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచింది. అటు దసరాకు రిలీజ్ చేస్తామన్న మేనిఫెస్టో ప్రకటన సైతం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ తరుణంలోనే టిడిపి, జనసేన జాయింట్ యాక్షన్ కమిటీల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ తో పాటు లోకేష్ హాజరుకానున్నారు. ఉమ్మడి కార్యాచరణ పై కీలక చర్చలు జరపనున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎలా ముందుకెళ్తుందో అని చర్చ సాగుతోంది.

చంద్రబాబు అరెస్టుతో నిలిచిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేష్ కొనసాగించనున్నారు. నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. వీటితో టిడిపి కార్యక్రమాలు పట్టాలెక్కుతాయని భావిస్తున్నారు. అయితే జగన్కు జర్క్ ఇవ్వాలంటే టిడిపి మేనిఫెస్టో ప్రకటించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టిడిపి కార్యక్రమాలకు బ్రేక్ వేసేందుకే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేశారన్న వ్యూహాన్ని దెబ్బ కొట్టాలంటే.. టిడిపి మేనిఫెస్టో ప్రకటించడం అనివార్యం. ఇప్పటికే చంద్రబాబు మినీ మ్యానిఫెస్టోను ప్రకటించారు. కీలక సంక్షేమ పథకాల విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. వాటిపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో టీడీపీ మేనిఫెస్టో పై రకరకాల అంచనాలు నడిచాయి. దసరాకు మేనిఫెస్టో బయటకు వస్తుందని అందరూ భావించారు. కానీ చంద్రబాబు జైలు తో ఆ అంశం మరుగున పడిపోయింది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యాక్టివ్ కావాలని చూస్తోంది. ఇటువంటి తరుణంలో చంద్రబాబు అనుమతితో, పవన్ కళ్యాణ్ సమ్మతితో మేనిఫెస్టోను టిడిపి, జనసేన జాయింట్ యాక్షన్ కమిటీల సమావేశం లో వెల్లడిస్తే మంచి ఫలితం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ సమక్షంలో మేనిఫెస్టో ప్రకటన చేస్తే ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే చంద్రబాబు లేకుండా మేనిఫెస్టో ప్రకటించే సాహసం టిడిపి చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.