Revanth Reddy: నిను వీడని నీడను నేనే.. అని ఓ సినిమాలో పాట. ఇక ఎవరిపై అయినా కక్ష ఉంటే.. నీడలా వెంటాడుతున్నాడు అంటుంటారు. తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితి అలాగే ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతను నీడలా వెంటాడుతున్నారడు. దీంతో ప్రతిపక్ష నేతగా ఎన్నికైనా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా గులాబీ బాస్ జంకుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతలకు ఏకిపారేసిన కేసీఆర్.. ఇప్పుడు అధికార పక్షానికి ఎదురు పడలేకా ఫామ్ హౌస్‌లో దాక్కుంటున్నారు. అసెంబ్లీకి వచ్చి నేరుగా మాట్లాడే ధైర్యం చేయడం లేదు. దీంతో రేవంత్ లోక్‌సభ ఎన్నికలపై వ్యూహం మార్చారు.
టార్గెట్ మెదక్..
ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు గెలవడమే సీఎం టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలిచే సీటు ఏదైనా ఉంది అంటే అది మెదక్ మాత్రమే. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి దీనినే తన టాస్క్‌గా పెట్టుకున్నారు. ఆ నియోజకవర్గాన్ని దెబ్బకొడితే ఇక కేసీఆర్ పని అయిపోయినట్లే అని భావిస్తున్నారు. ఇప్పటికే చచ్చిన పామును ఇంకా ఎవరైనా చంపుతారా అని అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. కానీ, చచ్చిన పామును ఇంకా కసితీరా చంపాలి అన్నట్లుగా సీఎం ప్రయత్నిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్‌ను నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి వెంటాడారు. అధిష్టానాన్ని ఒప్పించి కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేశారు. కానీ, ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. అయితే కేసీఆర్ ఓటమిలో రేవంత్ పాత్ర కచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని మెదక్‌లోనూ అమలు చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళిక రచిస్తున్నారు. బీఆర్‌ఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలని అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు బీఆర్‌ఎస్ గెలిచింది. అందరి మెజారిటీ కలిపితే 2 లక్షలకుపైగా ఉంది. అయినా అధికారంలో ఉన్నాం కాబట్టి మెదక్‌ను ఈసారి వదిలిపెట్టద్దని సీఎం పట్టుదలతో ఉన్నారు. బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చూస్తున్నారు.
గత ఎన్నికల్లో..
ఇక గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో మెదక్ అసెంబ్లీలో కాంగ్రెస్ గెలిచింది. సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలో బీఆర్‌ఎస్ గెలిచింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిథ కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,16,427 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌పై గెలిచారు. ఈసారి కేసీఆర్ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున మైనంపల్లి హనుమంతరావును బరిలో దించాలని చూస్తున్నారు.
పట్టు పెంచుకుంటున్న ‘మైనంపల్లి’
ఇక మైనంపల్లి హనుమంతరావు కూడా మెదర్ ఎంపీ సీటు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మెదక్ అసెంబ్లీ సీటును ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్‌రావు గెలిచారు. ఇక బీఆర్‌ఎస్‌కు బలమున్న సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌లో పట్టు సాధించేలా మైనంపల్లి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన వారిని తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పిస్తున్నారు. పటాన్ చెరులో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో అక్కడ బలమున్న నీలం మధును కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఇలా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా మెదక్ సీటును గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.