KCR Etela : ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఇప్పుడు ఈ సామెతను కెసిఆర్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ రూపంలో అమలు చేస్తోంది.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. చక్రం తిప్పుతా అని పదే పదే అంటున్న కేసీఆర్ కు మాంచి ఝలక్ ఇవ్వాలని బిజెపి యోచిస్తోంది. అందుకు తగిన ఆయుధాన్ని ఈటల రాజేందర్ రూపంలో తయారు చేస్తోంది. ఇదే విధానాన్ని గతంలో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మీద సుదేంద్రు అధికారి రూపంలో ప్రయోగించి విజయవంతమైంది. ఇప్పుడు అదే ఫార్ములా ను తెలంగాణలో అమలు చేయాలని తహతహలాడుతోంది.

-కెసిఆర్ కు పోటీగా..
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తారో లేదా ఎంపీగా బరిలో ఉంటారో తెలియదు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకుంటున్నారు. అయితే ఈ సంగతి ఎప్పటినుంచో కేసీఆర్ చెప్తూనే ఉన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే భారత రాష్ట్ర సమితిని ప్రకటించారు. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం కూడా నిర్మిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం లాంచనమేనని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. వారి అభ్యంతరాలకు కూడా ఈ రోజుతో గడువు ముగిసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తాపత్రయపడుతున్న బిజెపి కెసిఆర్ ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుంది.
-ప్రత్యర్థి రెడీ
బిజెపి ఆలోచన ప్రకారం కెసిఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తారని అనుకుంటోంది. ఇదే సమయంలో పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశాన్ని కూడా కొట్టి పారేయడం లేదు.. అయితే కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా, దేనికోసం పోటీ చేసినా అతడికి ప్రత్యర్థిగా బరిలోకి రాజేందర్ ను దింపే అవకాశం కనిపిస్తోంది. బిజెపి హై కమాండ్ కూడా ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్నది. కెసిఆర్ పై తాను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ పలుమార్లు ప్రకటించారు కూడా. ఒకవేళ గజ్వేల్ నియోజకవర్గం నుంచి కెసిఆర్ పోటీ చేస్తే అతనికి ప్రత్యర్థిగా ఈటల రాజేందర్ నిలపాలని బిజెపి అధినాయకత్వం యోచిస్తున్నది. పైగా కేసీఆర్ అనుపానులు రాజేందర్ కు తెలుసు కాబట్టి బీజేపీ కూడా లోలోపల చాలా హ్యాపీ గా ఉంది.
-గజ్వేల్ పై ఈటల దృష్టి
కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేస్తారనే సమాచారం ఉండటంతో రాజేందర్ ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు. తరచూ అక్కడ పర్యటనలు సాగిస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. స్థానిక యువతతో ఎప్పటికీ టచ్ లో ఉంటున్నారు. వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఒకవేళ కెసిఆర్ గజ్వేల్ నుంచి కాకుండా ఏదైనా పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తే.. తాను కూడా అక్కడినుంచి పోటీ చేయాలని ఈటెల రాజేందర్ అనుకుంటున్నారు.. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మీద సుదేంద్రు అధికారిని నిలబెట్టి విజయం సాధించిన బిజెపి.. ఈసారి కూడా అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని యోచిస్తోంది.. ఒకవేళ గనుక ఆ ఫార్ములా విజయవంతం అయితే బిజెపి పాచిక తెలంగాణలో పారినట్టే.