YS Sharmila : దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ది ప్రత్యేక స్థానం. ఆ పార్టీకి సంక్షోభాలు సర్వసాధారణం. కిందకు పడిన ప్రతిసారి.. అదే స్పీడ్ లో పైకి లేవడం ఆ పార్టీ ప్రత్యేకత. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావించారు. అటు తర్వాత సోనియా గాంధీ కీ రోల్ ప్లే చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం పతన స్థితిలో ఉన్న పార్టీని రాహుల్ పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో ఒక ఊపు వచ్చింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో మిగతా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అందులో భాగంగా ఏపీలో వైఎస్ షర్మిల, రఘువీరారెడ్డి ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది. షర్మిల తన తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్న సంగతి తెలిసిందే. ఏఐసీసీ వర్కింగ్ కమిటీలు పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి చోటు కల్పించారు. దీంతో కాంగ్రెస్ భారీ వ్యూహానికి తెర తీసినట్లయింది.
రఘువీరారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. వైయస్ కు అత్యంత సన్నిహితుడు. అంతకంటే మించి కాంగ్రెస్ కు వీర విధేయుడు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ సీనియర్లంతా వైసిపి బాట పట్టినా.. రఘువీరా మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. అందుకే ఇప్పుడు ఆయన సీనియార్టీని, సిన్సియార్టీని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మరోవైపు రఘువీరారెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఆ ప్రాంతం నుంచి కీలక నాయకుల కాంగ్రెస్ లో చేర్పించేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు షర్మిల సైతం తోడు కానుండడంతో.. ఆమెకు మార్గదర్శకం చేస్తారని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది. ఏఐసీసీ కార్యవర్గంలో రఘువీరా, పిసిసి అధ్యక్షురాలు హోదాలో షర్మిల వర్క్ అవుట్ అవుతుందని కాంగ్రెస్ నాయకత్వం బలమైన నమ్మకంతో ఉంది. కాంగ్రెస్కు వివిధ కారణాలతో దూరమైన వర్గాలన్నీ దరిచేరతాయని భావిస్తోంది. అయితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి.