Telangana Assembly Election 2023
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ అష్టకష్టాలు పడుతోంది. మేనిఫెస్టో ప్రకటించినా పెద్దగా ఓటర్ల నుంచి స్పందన రావడం లేదు. అసలు మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లడం లేదు. మరోవైపు కాంగ్రెస్ గ్యారెంటీ హామీలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఆరు గ్యారెంటీ హామీల ముందు బీఆర్‌ఎస్ మేనిఫెస్టో వెలవెలబోతోంది. మరోవైపు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఈసారి రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఎక్కడా లేదు. పంటల మద్దతు ధర, బోనస్‌పై ఎలాంటి హామీ లేదు. కేవలం పెన్షనర్లు, రైతుబంధు మాత్రమే క్రమంగా పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గ్యారంటీ హామీలు అమలు చేస్తామంటోంది. దీంతో ప్రజలు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. దీంతో కనీసం పథకాల లబ్ధిదారులను అయినా తమవైపు తిప్పుకునే ప్రయత్నం ప్రారంభించారు గులాబీ బాస్..
లబ్ధిదారులకు ఫోన్లు..
ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై దృష్టి పెట్టారు. పెన్షనర్లు ఎలాగైనా తమ వెంటే ఉన్నారని భావిస్తున్న గులాబీ బాస్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్‌రూం, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందినవారికి ప్రగతి భవన్ నుంచి ఫోన్లు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కాల్‌సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే వారిక ఆయా పథకాల లబ్ధిదారుల చిట్టా, ఫోన్ నంబర్ల జాబితా అప్పగించారు. వారు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు ఫోన్లు చేసి పథకం వచ్చింది కదా.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు.
చెన్నూర్ ఓటరు ఫోన్‌కాల్ వైరల్..
ఇలా చెన్నూర్ నియోజకవర్గంలోని ఓ ఓటరుకు ప్రగతి భవన్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్ వైరల్ అవుతోంది. ఇందులో ఫోన్ చేసిన అమ్మాయి.. ‘మీకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.60 వేలు వచ్చాయి కదా.. ఈసారి బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు ఓటు వేయండి’ అని కోరింది. దీనికి సదరు లబ్ధిదారు ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. ఎందుకు ఓటు వేయాలని తనకు ఇచ్చిన రూ.60 వేలు కేసీఆర్, బాల్క సుమన్ ఇంట్ల నుంచి ఇచ్చారా అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఉద్యోగ నోటికేషన్లు ఏమైనయ్, నిరుద్యోగ భృతి ఏమైంది. దళితబంధు ఎవరికి ఇస్తుండ్రు. నీకు ఉద్యోగం వచ్చిందా.. నీ వయసు 24 ఏళ్లు నీకు ఉద్యోగం వస్తే నేను కూడా సంతోషిస్తా.. మా పిల్లకు ఉద్యోగాలు వద్దా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో కాల్‌సెంటర్ యువతి షాక్ అయింది.