NTR Coin: యుగ పురుషుడు ఎన్టీఆర్. ఆయన శతజయంతి సందర్భంగా కేంద్రం ఆయన స్మారకార్థం రూ.100 నాణేన్ని ఆవిష్కరించింది. దీంతో ఆయన అభిమానులంతా సంతోషించారు. 100 రూపాయల నాణేలపై తమ అభిమాన నాయకుడి ఫోటో చూసుకో వచ్చని ముచ్చట పడ్డారు. అయితే చలామణి కోసం కాదని.. కొనుక్కుని ఇంట్లో దాచుకోవాలని తెలియడంతో బాధపడుతున్నారు.
గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ స్మారక నాణెం పై హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ నేతృత్యంలో 12 వేల ఎన్టీఆర్ ముఖచిత్రంతో నాణేలు తయారు చేసినట్లు ప్రకటించింది. రెండు రోజుల కిందట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాణేలను ఆవిష్కరించారు. అయితే ఇవి చలామణి కోసం కాదని.. సుమారు 5000 రూపాయలతో కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇంత దానికి అంత హడావుడి ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
100 రూపాయల నాణాన్ని రూ.5 వేలకు కొనుక్కుని.. ఇంట్లో దాచిపెట్టడం తప్ప ఏం చేయలేం. మన దగ్గర రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలపై మహనీయుల ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. ఆ నాణాలను చూసినప్పుడల్లా ఆ మహనీయుల చరిత్ర ఒక్కసారిగా కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. వాళ్లు చేసే త్యాగాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఎన్టీఆర్ స్మారక నాణెం అనేసరికి ఆ స్థాయిలో అందరూ ఊహించారు. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ 12 నాణేలను తయారుచేసింది. మరో ఎనిమిది వేలు నాణేలను తయారు చేయనుంది. అంటే 20వేల నాణేలు.. రూ.5 వేల చొప్పున.. రూ. కోటి వ్యాపారం చేసుకుందన్నమాట.
అంతకుమించి ఎన్టీఆర్ స్మారకాన్ని ఏ విధంగా గుర్తు చేసుకోగలం? ఆ నాణెం ఇంట్లో భద్రపరిచే చిన్నపాటి నగగా భావించగలం. అందుకే కాబోలు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దానిని పూజకు పనికిరాని పువ్వుగా అభివర్ణించారు. అది అక్షరాలా నిజమని ఎన్టీఆర్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ బ్రాండ్ ను కేంద్ర ప్రభుత్వం తన వ్యాపారానికి వినియోగించుకుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.