Asaduddin Owaisi: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఉత్తరప్రదేశ్ లో కాల్పుల కలకలం సంచలనం రేపింది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరట్ లోని కితౌర్ లో ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై ఆగంతకులు కాల్పులకు తెగబడటం తెలిసిందే. దీంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాల్పులకు పాల్పడింది ఎవరు? ఎందు కోసం చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనతో పాతబస్తీలో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రత చర్యలు తీసుకున్నారు.

మీరట్ నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో ఛజార్సీ టోల్ ప్లాజా వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు నెమ్మదిగా వెళ్లడంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. అతి సమీపం నుంచి నలుగురు వ్యక్తులు కాల్పులకు తెగబడినట్లు సీసీ పుటేజీ ద్వారా తెలుస్తోంది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై మూడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి. కానీ ఆయన మాత్రం సురక్షితంగా ఉండటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలనే డిమాండ్ వస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్ జనం మధ్యకు రావాలి
అసదుద్దీన్ పై కాల్పుల కలకలంపై తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో అందరికి ప్రచారం చేసే హక్కు ఉందని చెప్పారు. దేవుడి దయ వల్ల ఆయన సురక్షితంగా బయటపడటం సంతోషం కలిగించిందన్నారు. దీనిపై దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన అనంతరం హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీసీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇందులో ఎరువు రంగు హుడీ ధరించిన వ్యక్తి కాల్పులు జరుపుతూ కారు వైపు వచ్చి కింద పడిన విషయం తెలుస్తోంది. ఇంకో వ్యక్తి నలుపు రంగు ప్యాంట్ తెలుపు రంగు చొక్కా ధరించిన వాడు కాల్పులకు తెగబటం కనిపించింది. దీంతో వీరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. గాలింపు కూడా ముమ్మరం చేశారు. త్వరలోనే దీనిపై అన్ని వివరాలు సేకరిస్తామని ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతల విభాగం అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.
నిందితులు 9 ఎంఎం పిస్టల్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. వారి నుంచి మారణాయుధాల్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. అయితే తనపై పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని అసదుద్దీన్ ఆరోపించారు. దీనిపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వివరించనున్నట్లు వెల్లడించారు. తనపై జరిగిన దాడి వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికి ప్రచారం చేసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. తనపై దాడిని అందరు ఖండించాలని కోరారు.
దాడి అనంతరం చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అసదుద్దీన్ ఇంటి వద్ద ప్రత్యేక భద్రత కల్పించారు. నగరంలో ఎలాంటి గొడవలు రాకుండా చూశారు. సున్నితమైన అంశం కావడంతో అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పలు చోట్ల ప్రత్యేక గస్తీ నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: విద్యావ్యవస్థలో సమూల మార్పులకు జగన్ శ్రీకారం చుట్టనున్నారా?