
రాష్ట్ర బడ్జెట్ 2020-21 ఏడాదికి గాను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో భారీ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టడం విశేషం. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్ధికమంత్రి తెలిపారు.
ఏపీ బడ్జెట్(2020-21) ప్రధాన అంశాలు పరిశీలిస్తే..’అన్నిరకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు’ అంటూ బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రారంభించారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు మాత్రమే.
వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపు పరిశీలిస్తే..వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు, పశుగాణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు, హోంశాఖకు రూ.5,988.72 కోట్లు జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు, పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు, ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు, కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్‌కు రూ.16710.34 కోట్లు కేటాయింపులు జరిపారు.
సవరించిన అంచనాలు ఇలా ఉన్నాయి..
2019-20 ఏడాది సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు, మూలధన వ్యయం రూ.12,845.49 కోట్లు, రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు, ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు, ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతంగా ఉన్నాయి.
వివిధ పథకాలకు కేటాయింపులు గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు, రియల్ టైం గవర్నెన్స్ కోసం రూ.54.51 కోట్లు, వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు, వైఎస్‌ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు, డాక్టర్ వైఎస్‌ఆర్ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు, 104, 108 లకు రూ.470.29 కోట్లు, డాక్టర్ వైఎస్సార్ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు కేటాయించారు.
వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే, న్యాయ శాఖకు రూ. 913.76 కోట్లు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు, స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ. 856.64 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు, ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు, విద్యుత్ రంగానికి రూ. 6,984.72 కోట్లు, ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు, సోషల్ వెల్ఫేర్ కోసం రూ.12,465.85 కోట్లు, ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు
మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది.