సభ్య సమాజం ఎటు పోతోంది. సాటి మనిషికి సాయం చేయాలన్న కనీస ధ్యాస కూడా కరవవుతోంది. దీంతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఆపదలో ఉన్న వారికి కాస్త చేయూతనందిస్తే ప్రాణాలు నిలిపిన వారమవుతామని తెలిసినా కనీసం పట్టించుకోవడం లేదు. కాకులకు ఏదైనా జరిగితే వందల కాకులు వచ్చి సాయం చేసేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటి మనుషులమైన మనం ధర్మాన్ని విస్మరిస్తున్నాం. మన పనులే మనకు ముఖ్యం. సాటి వారికి ఏం జరిగినా పట్టించుకోవడం లేదు. దీంతో నాగరికత ఎటు వైపు వెళ్తుందో తెలియాల్సి ఉంది.
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు సంబంధించిన సీసీటీవీ పుటేజీ పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. మనిషిలోని మానవత్వం మటుమాయమవుతుందని తెలుస్తోంది. కత్తిపోట్లకు గురైన ఓ యువతిని రక్షించే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. చుట్టు వందలమంది ఉండగా ఓ అగంతకుడు కత్తితో దాడి చేయడం విస్తుగొలుపుతోంది. చుట్టు అందరు ఉన్నా ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. అడ్డుకోలేదు. ఫలితంగా ఆయువతి ప్రాణాలు గాల్లో కలిశాయి.
రమ్యపై దాడి జరిగే సమయంలో చుట్టు ఉన్న వారు చోద్యం చూశారు. కనీసం ఎందుకు అలా చేస్తున్నావని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో దుర్మార్గుడు రమ్యను కత్తిపోట్లకు గురిచేశాడు. దూరం నుంచి కనీసం ఓ రాయి విసిరినా అతడు భయపడి పోయేవాడు. కానీ ఇవేమీ పట్టించుకోని మనుషుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమ్య శరీరంపై చాలా వరకు కత్తిపోట్లున్నాయి. పొట్ట, గొంతు, పొత్తికడుపు భాగంలో కత్తి గాట్లు ఉన్నాయి.
మనుషుల్లో ఉన్న నిర్లక్ష్యంతోనే రమ్య ప్రాణాలు పోయాయి. చుట్టు ఉన్న వారు స్పందించి దాడిని ఆపితే ఆమె ప్రాణాలు పోయేవి కాదు. మనిషిలో మానవత్వం మాయమవుతోంది. మనకెందుకులే అనే నిర్లక్ష్యమే కనిపిస్తోంది. దీంతో విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాల్సిన మనందరిపై ఉంది. సాయం చేయాలంటే హీరోలే కానక్కర లేదు. సాటి మనిషిలో మంచిని మాత్రమే గుర్తించాలి.