BRS- E.C: ‘కొందరికి రాజకీయాలంటే గేమ్..నాకు మాత్రం మాత్రం టాస్క్’ అన్నారు కేసీఆర్. జాతీయ రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చీన గులాభీ అధినేత ఇప్పుడు మొదటి టాస్క్ ఎన్నికల సంఘంతోనే ఎదుర్కొబోతున్నారు. బీఆర్‌ఎస్ మార్పుకు ఆమోదం తెలుపడంలో జరుగుతున్న జాప్యం, మునుగోడులో ఈసీ ఆంక్షలు, కారును పోలిన ఎనిమిది గుర్తులు తొలగించాలని విజ్ఞప్తి చేసినా వాటిని ఇండిపెండెంట్లకు కేటాయించడంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఈసీ తీరుపై అసంతృప్తి..
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఈ దసరా రోజు టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చారు. మరుసటి రోజే ఎన్నికల సంఘానికి పార్టీ పేరుమార్పుపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి ద్వారా దరఖాస్తు ఇచ్చారు. వారం పది రోజుల్లో పేరు మార్పు ప్రక్రియ పూర్తవుతుందని గులాబీ బాస్ భావించారు. కానీ నెల 20 రోజులు కావొస్తున్నా.. ఎన్నికల సంఘం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఢిల్లీలో ధర్నాకు కేసీఆర్ ప్లాన్..
బీఆర్‌ఎస్‌గా పార్టీపేరు మార్పుకు అధికారిక ముద్ర పడగానే.. అసంతృప్తిగా ఉండే ఇతర పార్టీలను కూడా కలుపుకుని కేంద్ర ప్రభుత్వం తీరు, రైతుల సమస్యలపై ఢిల్లీలో ధర్నాను ప్లాన్ చేశారు. అయితే పార్టీపేరు మార్పుకు ఆమోద ముద్రవేయడంలో ఎన్నికల సంఘం జాప్యం చేస్తోంది. ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించింది. గతంలో ఆ గుర్తులు ఎవరికీ ఇవ్వబోమని ఈసీ టీఆర్‌ఎస్ ప్రతినిధులకు హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీకి వ్యతిరేకంగా గుర్తులను కేటాయించింది. దీంతో ఇక కేంద్ర విధానాల కంటే ముందు ఈసీ విధానంపైనే ఆందోళన చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు సమాచారం.
గొర్రెల పంపిణీపై ఆంక్షలు..
మునుగోడులో గొర్రెల పంపిణీ పథకాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో ప్రభుత్వం గొర్రెలకు బదులు నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని నిరణయించింది. దీనిపై కూడా ఫిర్యాదులు రావడంతో ఆ ప్రక్రియను కూడా ఎన్నికల సంఘం అడ్డుకుంది. దీనిపై కూడా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇక తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ అనుకుంటున్నారు. మునుగోడు ఉపఎన్నికల విషయంలోనే ఈసీ తీరును దేశం ముందు ఉంచాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

ఈసీ ఆఫీస్ ఎదుట ధర్నాకు ప్లాన్..
ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మునుగోడు పోలింగ్ కంటే ముందే ఈ ఆందోళన చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసీ వ్యవహారంపై బీజేపీయేతర రాష్ట్రాల్లో అభ్యంతరాలున్నాయి. గుజరాత్‌కు షెడ్యూల్ ప్రకటించకుండా ఒక్క హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే షెడ్యూల్ ప్రకటించడంపైనా విమర్శలున్నాయి. వీటన్నింటికీ కలిసి వచ్చేలా ఈసీ ఎదుట ధర్నాకు కేసీఆర్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది.