KA. Paul- Munugode By Election: మునుగోడు ఉప ఎన్నికను తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడులో విజయం సాధించాలని, తమ పార్టీ జెండా ఎగురవేయాలని తాపత్రయపడుతున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో నేను సైతం అంటూ కేఏ.పాల్ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీలే బిత్తర పోయేలా హామీలు ఇస్తున్నారు.

నేను సైతం అంటూ..
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ మునుగోడులో నేను సైతం అంటూ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తున్నారు. ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే, ఆ రాజకీయ పార్టీల వల్ల మునుగోడు అభివృద్ధి సాధ్యం కాదు. నాకు ఓటేసి గెలిపించండి. నేను మునుగోడు ని అభివృద్ధి చేస్తాను అని ప్రజలకు హామీ ఇస్తున్నారు కేఏ.పాల్.
ఇండిపెండెంట్‌గా పాల్
ప్రజాశాంతి పార్టీ నుంచి మునుగోడులో మొదట గద్దర్ నామినేషన్ వేస్తారని కేఏ.పాల్ మొదట ప్రకటించారు. కానీ, పోటీకి గద్దర్ నిరాకరించడంతో కేఏ.పాల్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ తరఫున వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇండిపెండెంట్‌గా వేసిన నామినేషన్‌తో ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల సంఘం అధికారులు పాల్‌కు ప్రస్తుతం ఉంగరం గుర్తును కేటాయించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తానంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కేఏ.పాల్. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడులోని ఓ చిన్నహోటల్‌లో దోశలు వేసి అక్కడ ఉన్న ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేశారు. అంతేకాదు సదరు హోటల్ నిర్వహిస్తున్న దంపతుల ఇద్దరు పిల్లలను కేజీ నుంచి పీజీ వరకు తానే చదివిస్తానని హామీ ఇచ్చారు.
యువతకు ఉద్యోగాలు ఇస్తా..
మునుగోడు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే.. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని కేఏ.పాల్ హామీ ఇస్తున్నారు. వందల మంది పిల్లలను తాను ఉచితంగా చదివిస్తానని, మండలానికి ఒక ఆసుపత్రి, కాలేజీని కట్టిస్తానని తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఇక రైతుల సమస్యలను సైతం పరిష్కరిస్తానని ప్రచారం చేస్తున్నారు. ఏడు మండలాల్లో ఏడు వేల మంది నిరుద్యోగులకు ఆరు నెలల్లోనే ఉద్యోగాలు ఇస్తానంటూ హామీ ఇస్తున్నారు. రెండేళ్లలో మునుగోడులో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానంటున్నారు కేఏ.పాల్. నిరుద్యోగులు అందరూ తన కేఏ.పాల్ యాప్‌లో లాగిన్ అవ్వాలని సూచిస్తున్నారు. ఆ యాప్‌ని షేర్ చేయమని కోరుతున్నారు.

ఆ పార్టీల కార్యకర్తలంతా తనకే ఓటు వేయాలి..
ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలంతా తనకే ఓటు వేయాలని పాల్ కోరుతున్నారు. తన పార్టీ గుర్తు ఉంగరం అని పేర్కొన్న ఆయన కుల, కుటుంబ, అవినీతి పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టి మన మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అని సూచిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చెబుతున్న రాజకీయ నాయకుల ప్రచారాన్ని, దొంగ మాటలను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి మునుగోడు ఎన్నికల ప్రచారంలో కేఏ.పాల్ ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం చేయడం, హామీలు ఇవ్వడం నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది.