BRS Vs Congress: కాంగ్రెస్ కు అనుకూలంగా బీఆర్ఎస్ వ్యూహాలు

రోగి కోరుకున్నది పెరుగన్నం.. డాక్టర్ తినమని చెప్పింది కూడా పెరున్నమే అనే సామెత తీరుగా.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో తనకు విపరీతమైన మైలేజ్ కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. పైన తధాస్తు అని దేవతలు అన్నారేమో..

Written By: Bhaskar, Updated On : July 14, 2023 8:54 am

BRS Vs Congress

Follow us on

BRS Vs Congress: మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మహా అయితే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మూడు లేదా నాలుగు నెలలు పాలిస్తుంది కావచ్చు. ఆ తర్వాత కచ్చితంగా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈలోగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తుంది. ఎన్నికల సమయంలో పార్టీల మధ్య హోరాహోరి జరుగుతుంటుంది. ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన రెండు పర్యాయాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి మధ్య పోటీ జరిగింది. అయితే ఈసారి కూడా ఆ రెండు పార్టీల మధ్యే పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. మొన్నటిదాకా కాంగ్రెస్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పొడ చూపడం ప్రారంభమైంది. దీనికి తోడు కేటీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి మధ్య ఆశించినత స్థాయిలో గొడవలు జరగడం లేదు.

కాంగ్రెస్ నే పట్టించుకుంటున్నది

కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీని భారత రాష్ట్ర సమితి పట్టించుకుంటున్నది. పైగా ధర్నాలు కూడా చేస్తోంది. ఒక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై ధర్నాలు చేయడం ఏంటనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తం అవుతున్నప్పటికీ.. అది అధికార పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటే ఇస్తారా? లేక ఎనిమిది గంటలు మాత్రమే కరెంటు ఇస్తారా? అనేది తర్వాత సంగతి. కానీ కాంగ్రెస్ పార్టీ తోనే హోరాహోరీగా పోరాడుతున్నామనే భావనను భారత రాష్ట్ర సమితి తెరపైకి తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకప్పుడు ధాన్యం కొనుగోళ్ళు, విద్యుత్ చట్టాలు వంటి విషయాల మీద భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి ఆందోళనలు
చేసేది. తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీపై బీఆర్ఎస్ సైలెంట్ అయింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తోంది.

కాంగ్రెస్ నేతల ఖుషి

రోగి కోరుకున్నది పెరుగన్నం.. డాక్టర్ తినమని చెప్పింది కూడా పెరున్నమే అనే సామెత తీరుగా.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో తనకు విపరీతమైన మైలేజ్ కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. పైన తధాస్తు అని దేవతలు అన్నారేమో.. కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగానే భారత రాష్ట్ర సమితి దానికి అనుకూలంగా పని చేసుకుంటూ వెళ్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఖుషి అయిపోతున్నారు. అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. భారత రాష్ట్ర సమితి పై చేసే ఎదురు దాడిలో ఒకింత ఐకమత్యం ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం లాంటి సభలో కూడా ఒకే వేదికపై కాంగ్రెస్ నేతలు ఐక్యతా రాగం వినిపించారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని భారత రాష్ట్ర సమితి చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే తానా మహాసభల్లో ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో.. దానిని లేనిపోని విధంగా భారత రాష్ట్ర సమితి ప్రచారం చేయడం మొదలు పెట్టింది. ఇక ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి పై మరింత ఎదురు దాడి చేసి.. పోరాటం ఒక రేంజ్ లో ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసుకుంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇవ్వడంతో.. భారత రాష్ట్ర సమితి కూడా డిఫెన్స్ లో పడింది. ఇక ప్రస్తుత పరిణామాలను చూస్తే కొద్ది రోజులపాటు భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సాగుతుంది.

బిజెపి వెనుకబడింది

ఈ రేసులో మొదటిదాకా రెండవ స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ యాదృచ్ఛికంగా మూడవ స్థానంలోకి వెళ్లిపోయింది. పైగా ఇటీవలి కాలంలో బిజెపి పెద్దగా పోరాటాలు చేసింది ఏమీ లేదు. దీనికి తోడు బండి సంజయ్ ని అధ్యక్ష స్థానం నుంచి అధిష్టానం తొలగించింది. శాంత స్వభావుడైన కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. ఈ ప్రకారం చూసుకుంటే ఇక ఇప్పట్లో భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాలు కూడా కనిపించడం లేదు. ఆ ఉద్యమాలకు కిషన్ రెడ్డి నాయకత్వం వహించే అంత స్టామినా కూడా లేదు. ఈ పరిణామాలు మొత్తం జరుగుతుండగానే కెసిఆర్ తనకు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు బండి సంజయ్ గొప్పగా ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది.