Mynampally Hanumanth Rao: మైనంపల్లిపై వేటు?!.. ఆ మంత్రి అల్లుడికి ఆ సీటు

అయితే నిన్న మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితిలో మూడవ పవర్ హౌస్ గా ఉన్న హరీష్ రావును మైనంపల్లి తీవ్రాతీతీవ్రమైన పదాలతో విమర్శించడం ఒకింత సంచలనానికి దారి తీసింది.

Written By: Bhaskar, Updated On : August 22, 2023 1:47 pm

Mynampally Hanumanth Rao

Follow us on

Mynampally Hanumanth Rao: సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ రాష్ట్రం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హనుమంతరావు తిరుగులేని స్ట్రోక్ ఇచ్చారు. మీడియా మొత్తం దెబ్బకు నిన్నంతా మైనంపల్లి గురించే మాట్లాడటం మొదలు పెట్టింది. ఒక్క టీ న్యూస్ తప్ప మిగతా చానల్స్ మొత్తం కూడా మైనంపల్లి చేసిన వ్యాఖ్యల మీదనే ప్రధానంగా ఫోకస్ చేశాయి.. మైనంపల్లి హరీష్ రావు మీద తీవ్రాతీతీవ్రంగా ఆరోపణలు చేయడంతో కేటీఆర్ నుంచి మొదలుపెడితే కవిత వరకు స్పందించారు. హరీష్ రావుకు సంఘీభావం తెలిపారు. అయినప్పటికీ కెసిఆర్ ప్రకటించిన జాబితాలో మైనంపల్లి పేరు ఉండడం విశేషం. ఇదే విషయాన్ని మైనంపల్లి ఎదుట విలేకరులు ప్రస్తావిస్తే.. మల్కాజ్గిరి నుంచి తాను, మెదక్ నుంచి తన కొడుకు కచ్చితంగా పోటీ చేస్తారని మైనంపల్లి ప్రకటించడం విశేషం. అంతేకాదు తనపై ఎటువంటి చర్యలు తీసుకున్నా సిద్ధమే అన్న సంకేతాలు మైనంపల్లి ఇవ్వడం విశేషం.

అయితే నిన్న మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితిలో మూడవ పవర్ హౌస్ గా ఉన్న హరీష్ రావును మైనంపల్లి తీవ్రాతీతీవ్రమైన పదాలతో విమర్శించడం ఒకింత సంచలనానికి దారి తీసింది. సరిగా ఇదే వ్యాఖ్యలను ఉటంకిస్తూ అటు కేటీఆర్, ఇటు కవిత ఘాటుగా స్పందించారు. భారత రాష్ట్ర సమితి ప్రారంభం నుంచి హరీష్ రావు ఉన్నారని.. ఆయనపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కేవలం వారి నుంచి మాత్రమే కాకుండా భారత రాష్ట్ర సమితి నాయకుల నుంచి మైనంపల్లికి తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట కూడా విలేకరులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఎవరినైనా కూడా బయటికి పంపిస్తానని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

అయితే మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బయటికి పంపిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయం ముందే తెలిసిన మైనంపల్లి కూడా తాను దేనికైనా సిద్ధమే అనే సంకేతాలు ఇచ్చారు. తన కొడుకు భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తానని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ కుటుంబంలో కొడుకు, కూతురు, అల్లుడికి పదవులు ఇచ్చినప్పుడు.. తన కొడుకుకు ఎందుకు మెదక్ టికెట్ కేటాయించరని మైనంపల్లి ప్రశ్నిస్తున్నారు. అయితే మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద ఆరోపణలు చేసిన మైనంపల్లికి.. ఆ పార్టీలోకి చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది.

ఒకవేళ మైనంపల్లి ని పార్టీ బయటకు పంపిస్తే ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. గతంలో ఇదే స్థానం నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి రాజశేఖర్ రెడ్డి ఓడిపోయారు. అయితే తన అల్లుడికి కంటోన్మెంట్ స్థానం నుంచి టికెట్ ఇప్పించుకునేందుకు మల్లారెడ్డి అనేక మార్గాల్లో ప్రయత్నించారు. ఆ స్థానాన్ని దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత కు కేటాయించడంతో మల్లారెడ్డి డీలా పడ్డారు. అయితే ఈ మల్కాజ్గిరి స్థానాన్ని తన అల్లుడికి కేటాయించాలని ప్రస్తుతం మల్లారెడ్డి కోరడంతో.. కేసీఆర్ నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చాయని తెలుస్తోంది. మరి మల్లారెడ్డి అనుకున్నట్టుగా హనుమంతరావును పార్టీ నుంచి బయటికి పంపిస్తారా? సొంత కులపోడు కాబట్టి కెసిఆర్ సైలెంట్ గా ఉంటారా? అనేవి తేలాల్సి ఉంది.