BRS MP Candidates : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే..

ఇటీవల మహబూబాబాద్ నియోజకవర్గంలో జీవన్ లాల్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ స్థానానికి తాను బరిలో ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు. కానీ తీరా అభ్యర్థిని ప్రకటించే విషయంలో కెసిఆర్ కవిత వైపు మొగ్గు చూపారు. కెసిఆర్ నిర్ణయంతో జీవన్ లాల్ వర్గం డీలా పడినట్టు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : March 4, 2024 7:40 pm
Follow us on

BRS MP Candidates : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు. తాజాగా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి మాలోత్ కవిత, ఖమ్మం నియోజకవర్గం నుంచి నామ నాగేశ్వరరావు పోటీ చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పొందిన నేపథ్యంలో కీలక నాయకులు భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెబుతున్నారు. జహీరాబాద్ ఎంపీ పాటిల్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చారు. వీరిలో వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా.. పాటిల్, రాములు కాషాయ కండువా కప్పుకున్నారు. బిజెపి ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో.. శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు కేసిఆర్ నలుగురు అభ్యర్థులను ప్రకటించారు.

ఆదివారం తెలంగాణ భవన్లో కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో కెసిఆర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య ఉంటుందని కెసిఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఏదో అదృష్టం కొద్దీ మొన్నటి ఎన్నికల్లో గెలిచిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదని కెసిఆర్ ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు సత్తా చూపిస్తారని ఆయన వివరించారు.. ఆదివారం నిర్వహించిన సమావేశంలో పెద్దపల్లి, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. సోమవారం మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అయితే భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయడానికి చాలామంది అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే కెసిఆర్ ఒకేసారి అభ్యర్థుల పేర్లను ప్రకటించడం లేదని సమాచారం.

ఇక సోమవారం ప్రకటించిన మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి మాలోత్ కవిత పోటీ చేయరని అందరూ అనుకున్నారు. ఈ స్థానం నుంచి ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ తనయుడు, ఐ ఆర్ ఎస్ అధికారి జీవన్ లాల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. టికెట్ కూడా ఆయనకే ఇస్తారని భారత రాష్ట్ర సమితిలో ఒక వర్గం నాయకులు అనుకున్నారు. ఇటీవల మహబూబాబాద్ నియోజకవర్గంలో జీవన్ లాల్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ స్థానానికి తాను బరిలో ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు. కానీ తీరా అభ్యర్థిని ప్రకటించే విషయంలో కెసిఆర్ కవిత వైపు మొగ్గు చూపారు. కెసిఆర్ నిర్ణయంతో జీవన్ లాల్ వర్గం డీలా పడినట్టు తెలుస్తోంది.