BRS Leaders : తెలంగాణలో ఎన్నికల వేళ.. విజయం కోసం నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఒకవైపు ప్రచారంలో దూకుడు పెంచుతూనే.. మరోవైపు దేవుడి ఆశీర్వాదం కోసం పూజలు చేస్తున్నారు. సెంటిమెంటు ఆలయాల్లో నామినేషన్ పత్రాలు ఉంచి నామినేషన్లు వేశారు. ఇక సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఆయన 2014, 2018 ఎన్నికల వేళ ఆయన రాజశ్యామల యాగం చేశారు. దీంతో అధికారం ఆయనను వరించిందని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తారు. తర్వాత కూడా ఆయన పలుమార్లు యాగాలు చేశారు. దీంతో ఆయన బాటలోనే కొంతమంది నేతలు పయనిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలు ఎన్నికల వేళ రాజశ్యామల యాగం చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు యాగాలు చేశారు.
మంచిర్యాల జిల్లాలో…
మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు రాజశ్యామల యాగం నిర్వహించారు. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఇప్పటి వరకు రెండుసార్లు బరిలో నిలిచి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల దీవెనతోపాటు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని రాజశ్యామల యాగం చేశారు. ఇక చెన్నూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కూడా రాజశ్యామల యాగం చేశారు. ఈసారి గెలిస్తే ప్రమోషన్ దక్కుతుందని సుమన్ భావిస్తున్నారు. 2014లో పెద్దపల్లి ఎంపీగా, 2018లో చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి చెన్నూర్ బరిలోనే దిగారు, అయితే ఆయనకు ఈసారి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ఆయన కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం యాగం చేశారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి. ఆయన 2014లో బీఎస్పీ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో బీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా బీఆర్‌ఎస్ తరఫున బరిలో ఉన్నారు. అయితే ప్రత్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో ఎలాగైనా గట్టెక్కాలని ఆయన నామినేషన వేసిన అనంతరం రాజశ్యామల యాగం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో నెగ్గుతానని అనుకుంటున్నారు. మరోవైపు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా ఈసారి విజయంపై దీమాతో ఉన్నారు. ఆయన దసరా సందర్భంగానే అమ్మవారి దీక్ష తీసుకుని యాగం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఇక ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ కూడా ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో రెండోస్థానానికే పరిమితమయ్యారు. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి ప్రజల దీవెనలు ఉన్నాయని, అమ్మవారి ఆశీస్సులు కూడా తోడవ్వాలని రాజశ్యామల యాగం నిర్వహించారు.
మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు సీఎం కేసీఆర బాటలో రాజయోగం కోసం రాజశ్యామల యాగం నిర్వహించారు. మరి వీరి యాగాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.