
KCR: సిరిసిల్లలో దళితుల పైన దాడులు జరిగాయి.. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య చేసుకుంది.. హైదరాబాదులో ఓ బాలుడిని కుక్కలు గాయపరిచి చంపేశాయి.. గవర్నర్ మీద ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు.. కానీ వీటి మీద కేటీఆర్ ఎన్నడూ స్పందించలేదు. కనీసం ప్రీతి చనిపోతే ఆమె తల్లిదండ్రులను పరామర్శించేందుకు కూడా వెళ్ళలేదు.. కానీ అదే సమయంలో సానియా మీర్జా తన టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు.. అలాంటి కేటీఆర్ హఠాత్తుగా ఇవాళ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న తోరూర్ సభలో నరేంద్ర మోడీని కడిగిపారేసిన కేటీఆర్.. ఇవాళ కూడా అదే స్థాయిలో ఆగ్రహాన్ని ప్రదర్శించాడు.. అటు ఢిల్లీలో కవిత,ఇటు హైదరాబాదులో కేటీఆర్.. ఈసారి ఇద్దరి ప్రెస్మీట్లు నడిచాయి. కానీ ఇద్దరు సుదీర్ఘంగా మాట్లాడినప్పటికీ లిక్కర్ స్కాంతో కవితకు సంబంధం లేదని చెప్పకపోవడం విశేషం.

ఇటీవల చాలా సభల్లో భారత రాష్ట్ర సమితి కుటుంబ పార్టీ కాదని, తెలంగాణ ఇంటి పార్టీ అని కేటీఆర్ స్పష్టం చేశారు.. ఒకానొక దశలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటికి కెసిఆర్ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. కానీ దానిని ఇప్పుడు తన చేతుల్లో నిరూపించుకోలేదు.. రాష్ట్రంలో అనేక దారుణాలు చోటు చేసుకున్నప్పటికీ కించిత్ స్వరం కూడా పెంచలేదు.. కానీ ఎప్పుడైతే తన చెల్లెలు పేరు లిక్కర్ స్కామ్ లో వినిపించిందో అప్పటినుంచి కేటీఆర్ నరేంద్ర మోడీపై విమర్శలు చేయడం ప్రారంభించారు.. చివరకు మహిళా దినోత్సవం రోజు కూడా నరేంద్ర మోడీకి భార్య లేదు అంటూ కుటిల వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక కవితను అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.. మరోవైపు కేటీఆర్ ను భారతీయ జనతా పార్టీ నాయకులు మరింత గెలుకుతున్నారు. ఇటీవల ఆయన అనుచరుడిని కలిసిన బండి సంజయ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో అతడు భారతీయ జనతా పార్టీలో చేరాడు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ పైన అతడిని బిజెపి అభ్యర్థిగా నిలబెట్టేందుకు బండి సంజయ్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. దీంతో మరింత ఆగ్రహం గా ఉన్న కేటీఆర్ భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేశాడు. ఇలాంటి సమయంలోనే నెటిజెన్లు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు.. మిగతా సందర్భాల్లో కనిపించని కేటీఆర్.. ఇప్పుడు తన చెల్లెలు లిక్కర్ స్కాం లో ఇరుక్కున నేపథ్యంలో బయటికి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కాం మీ ఇంటికి సంబంధించిన విషయం, దాంతో తెలంగాణకు ఏం సంబంధం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. దీంతో ప్రస్తుతం ఈ చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు పలు సందర్భాల్లో కేటీఆర్ వ్యవహరించిన తీరుపై చర్చ కూడా సాగుతోంది.