Khammam BRS Meeting: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ అట్టహాసంగా జరిగిందని అధికార పార్టీ, అబ్బే లక్ష మందికి మించి జనం హాజరు కాలేదని బిజెపి… ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగానే… ఈ సభ అనంతరం ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా సమాధానం అంత చిక్కడం లేదు.. 25 నిమిషాలు మాత్రమే మాట్లాడిన కేసీఆర్ త్వరలో మా పార్టీ జాతీయ విధానం ఏమిటో చెబుతామని ప్రకటించాడు. జాతీయ రాజకీయాల్లో గాయి గత్తర లేపుతామని అని గతంలో గాండ్రించిన కెసిఆర్ కు అసలు తాను వెళ్లాల్సిన దారి ఏమిటో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు.. అసలు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సందర్భం అంటే బలపడే సంకల్పాన్ని తీసుకోవాలి. అని ఈ నాన్ బిజెపి, కాంగ్రెస్ ఉద్దండుల ఆశీస్సులు దేనికి? దీనికి సంఘీభావం అని పేరు పెట్టినప్పటికీ…మరీ కెసిఆర్ పక్కన విమానాల్లో తిరుగుతూ మీడియా దృష్టిలో దుమ్మురేపిన ప్రకాష్ రాజ్, రాజేష్ టికాయత్, కుమారస్వామి, ప్రశాంత్ కిషోర్ జాడ అసలు కనిపించలేదేమి? రేపు పొద్దున ఈ రాజా,విజయన్, అరవింద్, అఖిలేష్, భగవంత్ కూడా అలానే… జస్ట్ షో పీస్ లు. విమానాలు పంపితే వస్తారు.. భోజనాలు పెడితే తింటారు.. మైక్ ఇస్తే నాలుగు మాటలు మాట్లాడతారు. శాలువాలు కప్పితే కప్పించుకుంటారు. వచ్చిన దారిన వెళ్ళిపోతారు.

నిజంగా కెసిఆర్ నాయకత్వం పట్ల, భారత రాష్ట్ర సమితి పట్ల, సాధించబోయే విజయాల పట్ల అంత నమ్మకమే ఉంటే వీరంతా కూడా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయ ప్రారంభానికి వెళ్లేవారు కదా? ఢిల్లీలో చేసిన రైతుదీక్షకు సంఘీభావం ప్రకటించేవారు కదా? కనిపించి కనిపించకుండా, వినిపించి వినిపించకుండా, కాంగ్రెస్ కూటమి బలపడకుండా కెసిఆర్ అడుగులు అడ్డంకులు అవుతాయి తప్ప పెద్దగా ఒనగూరేది ఏమీ ఉండదు.
మోడీ ఇంటికి మనం ఢిల్లీకి అని ప్రతిజ్ఞలు చేస్తున్నవారు ఎలా కలిసి పోరాడాలి? అసలు ఎలా పోరాటం చేస్తారు? వీరంతా కూడా భారత రాష్ట్ర సమితిలో విలీనం కావాలా? పోనీ అవుతారా? సాధ్యమేనా? ఇక భారత రాష్ట్ర సమితికి మద్దతు ఇస్తూ పోరాడాలా? భారత రాష్ట్ర సమితి మాత్రమే ఎందుకు? వేరే పార్టీలు లేవా? ప్రత్యామ్నాయ కూటమి కట్టలేరా? దీనికి ఒక కొత్త జాతీయ ఇండిపెండెంట్ పార్టీ ఆవిర్భావ సభ వేదిక కావడం దేనికి? ఇన్ని ప్రశ్నలకు నిన్న వేదికపై కూర్చున్న నలుగురు ఉద్దండుల దగ్గర్నుంచి ఒకటంటే ఒకటి స్పష్టమైన సమాధానం రాదు.. ఎందుకంటే వారి దగ్గర సమాధానం లేదు..
ఎవరూ ఓడించలేనంత ఉద్దండు డేమి కాదు మోడీ.. ఎటు వచ్చి పొలిటికల్ మరగజ్జులు మినహా తనను ఢీకొట్టే ప్రతిపక్ష నాయకులు లేరు. అదే మోడీ బలం. మొన్న గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించినది ఏమిటి? ఏదో ఢిల్లీలో ఆందోళనకు మద్దతు ఇచ్చినందుకు పంజాబ్ రాష్ట్రాన్ని కానుకగా ఇచ్చిన ఖలిస్తాని శక్తుల మద్దతు తప్ప అరవింద్ కేజ్రివాల్ కు వేరే బలం ఏముంది? ఇప్పట్లో అఖిలేష్ మళ్లీ కోలుకునే సీన్ లేదు. ఉత్తరప్రదేశ్ దాటి వచ్చే సవాలే లేదు.

ఇక కమ్యూనిస్టు పార్టీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాళ్ల గూర్చి బట్టలు సర్దుకునే సీనే లేదు. మరీ వీరంతా కలిసి ఏం చేస్తారు? కెసిఆర్ కు వెదురు బద్దలు కట్టి మోడీకి ఎదురు నిలబెట్టే అంత సీన్ ఉందా? పోనీ కలిసే పోరాడుతారు అనుకుంటే బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమితోనే కదా కలిసి ఉన్నారు.. అధికారంలో కూడా ఉన్నారు.. మరి ఈ కేసీఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో ఈ పాత్ర దేనికి? కెసిఆర్ ఏదైనా యాంటీ _ మోడీ కనీస ఉమ్మడి కార్యాచరణ కానీ, యాంటీ_ మోడీ పొలిటికల్ రూట్ మ్యాప్ గాని ప్రకటించాడా? డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, దేహి అని అడిగితే తప్ప లెఫ్ట్ కు సీట్లు లేవు. కేరళ తప్ప వేరే సొంత అధికార వేదిక కూడా లేదు.. రాజకీయ పోరాట క్షేత్రం అంతకన్నా లేదు.. ఈ కుక్క మూతి పిందెల పక్కన నిలబడటం పోరాటం అంటే? ఈ సూది దబ్బుణం పార్టీలా కేసీఆర్ ను నిలబెట్టేది? ఆయన కోరుకుంటున్న కిసాన్ సర్కార్ ను తెచ్చేది? నిజాలు ఇలా నిష్ఠురంగానే ఉంటాయి.. వీళ్ళు ఎవరూ కేసీఆర్ వెంట ఉండరు. ఉండలేరు.. ఏ కోణమూ వీరికి సహకరించదు. మొదట్లో చెప్పుకున్నట్టు ఊదు కాలదు.. పీరి లేవదు. ఏదో కొద్ది రోజులు హడావుడి.. పత్రికలకు జాకెట్ల యాడ్స్, సో కాల్డ్ నమస్తే తెలంగాణ కు పేజీల కొద్దీ మోసుడు కార్యక్రమం తప్ప.. పెద్దగా ఏమీ ఉండదు.. ఉండబోదు.