Hyderabad: విశ్వ నగరం వైపు హైదరాబాద్ అడుగులు వేస్తోంది.. ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ సంస్థలతో ఆలరారుతోంది.. ముఖ్యంగా శివారు ప్రాంతాలు బహుళ అంతస్తులతో కాంక్రీట్ జంగిల్ మాదిరి దర్శనమిస్తున్నాయి.. మునుముందు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం కల్పిస్తోంది.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నెక్నంపుర, ఫిలిం సిటీ, నానక్ రామ్ గూడ వంటి ప్రాంతాలు సిలికాన్ వ్యాలీ మాదిరి దర్శనమిస్తున్నాయి. అసలు మనం ఉన్నది హైదరాబాదులోనైనా అనే భ్రమను కలిగిస్తున్నాయి.

ఇదంతా ఒక కోణం అయితే… హైదరాబాదులో పెరిగిన అభివృద్ధి వల్ల ట్రాఫిక్ సమస్యలు నానాటికి జటిలమవుతున్నాయి.. దీంతో నగరవాసులు నరకం చూస్తున్నారు. మెట్రో అందుబాటులోకి వచ్చినప్పటికీ ట్రాఫిక్ సమస్య ఇంకా వేధిస్తూనే ఉంది.. ఈ క్రమంలో అండర్ బైపాస్ లు, వ్యూహాత్మక రహదారులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మిస్తోంది. కొన్నిచోట్ల ప్రారంభించింది కూడా.. వీటివల్ల ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గింది.. ఈ క్రమంలో మరిన్ని కారిడార్లు నిర్మించాలని యోచిస్తోంది.. వీటివల్ల ట్రాఫిక్ సమస్య తగ్గి… సగటు నగరవాసికి ఉపశమనం కలుగుతుంది.

వ్యూహాత్మక రహదారులు, అండర్ బై పాస్ లు నిర్మిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్… 568 కోట్లతో 29 వ్యూహాత్మక కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది.. వీటిలో వివిధ రకాల సౌకర్యాలు కల్పించనుంది. పార్కింగ్, వెండింగ్ జోన్లు నిర్మించనుంది.. హైదరాబాదులోని హబ్సిగూడ నుంచి ఆరంగర్ వరకు, ఎన్ఎండిసి నుంచి గచ్చిబౌలి వయా షేక్ పేట వరకు కారిడార్లు నిర్మించనుంది..ఒక్కో కారిడార్ ను 150 నుంచి 200 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాంతాల్లో నగరం వేగంగా విస్తరిస్తున్నందున ఈ కారిడార్లు నిర్మించనుంది. వీటివల్ల ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు, ప్రజలు సైక్లింగ్ చేసుకునే వెసలు బాటు కూడా ఉంటుంది. ఫలితంగా కాలుష్యం తగ్గి, ప్రజలకు శారీరక శ్రమ అలవడుతుందని భావిస్తోంది.