BRS: కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ
అంటే దీని భావం.. ఒక మంచి ముహూర్తంలో కుక్కను బంగారు సింహాసనం పైన కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని నీచ స్వభావం వదిలిపెట్టదు. అలాగే నీచున్ని ఉన్నత పదవిని ఇచ్చిన వాడు తన నీచ స్వభావాన్ని విడువడు.
ఇదీ నిన్న కేటీఆర్ చేసిన ట్వీట్. సహజంగా ఇలాంటి పోస్టులు కేటీఆర్ నుంచి తెలంగాణ సమాజం ఊహించి ఉండదు. పైగా ఇలాంటి నేలబారు ట్వీట్ అతడి వ్యక్తిత్వానికి సరిపోదు. మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉండి.. షాడో ముఖ్యమంత్రిగా పెత్తనం చెలాయించి.. ఇప్పుడు ఒక్కసారిగా అధికారం కోల్పోయేసరికి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడు. అని నిన్నటి నుంచి నెటిజన్లు ఆయన మీద విరుచుకుపడుతున్నారు. సహజంగా కేటీఆర్ ట్వీట్ చేస్తే చాలావరకు పాజిటివ్ రిప్లై లే ఉంటాయి. అదేంటో గాని నిన్న ఉదయం కేటీఆర్ చేసిన పై పోస్టులో అయితే మాత్రం ఎక్కువగా నెగిటివ్ రిప్లే లే వచ్చాయి.
సరే కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడు కాబట్టి.. ఆయన పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన హక్కు కాబట్టి.. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి కూడా ఇలానే కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు కాబట్టి.. కొంత మినహాయింపు ఇద్దాం. సరే ఆ లెక్కన కేటీఆర్ ఎన్ని హామీలు అమలు చేశారు? ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారు? గ్లోబరీనా కంపెనీ నిర్వాకం వల్ల ఇంటర్ విద్యార్థులు చనిపోతే ఏం సమాధానం చెప్పారు? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపాల పుట్టగా మారితే ప్రతిపక్షాలను ఎలా విమర్శించారు? చివరికి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు ప్రేమ సంబంధం ఉందని కేటీఆర్ కదా మాట్లాడింది? మరి అలాంటప్పుడు శునకం అనే సామెతను కేటీఆర్ ఎలా పోస్ట్ చేయగలరు? అంతేకాదు ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంలో ఆరి తేరిన గులాబీ నాయకులపై ఒక్కనాడయినా కెసిఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుందా? అంత గొప్పగా చెప్పుకునే రైతుబంధులో చివరికి శ్రీశైలం హైవే రోడ్డుకు కూడా డబ్బులు ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఈ పథకాన్ని అత్యంత గొప్పది అని ఎలా ప్రచారం చేసుకుంటారు?
అక్కడిదాకా ఎందుకు జీవో 58, 59 పేరుతో గులాబీ నేతలు ప్రభుత్వ భూములను కొల్లగొట్టింది నిజం కాదా? కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేసిన పురపాలక శాఖ తీసుకువచ్చిన ప్రత్యేక వెబ్సైట్లో క్షేత్రస్థాయిలో ఒక ఫోటో పెట్టి, వాస్తవంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి సర్కారుకు జెల్ల కొట్టింది నిజం కాదా? ప్రాథమిక విచారణ అనంతరం ఇప్పటివరకు వేలాది ఎకరాల భూములను ఆక్రమించారని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ జీవో 58, 59 ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు? దీని ద్వారా ఎంత మంది పేదలు లబ్ది పొందారు? వారి నుంచి ప్రభుత్వానికి అందిన సహకారం ఏ స్థాయిలో ఉంది? అనే వాటికి గత భారత రాష్ట్ర సమితి పెద్దల వద్ద ఎటువంటి సమాధానం లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత భూ ఒప్పందాలను, భూ క్రమబద్ధీకరణలను తవ్వితీస్తుంటే కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఉదాహరణకు ఖమ్మం నగరానికి చెందిన భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తన భార్య పేరు మీద 411 గజాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించుకున్నాడు. అది కూడా జీవో 59 పేరుతో. క్షేత్రస్థాయిలో ఒక ఫోటో చూపించి.. వాస్తవంలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని తన పేరు మీద బదలాయించుకున్నాడు. ఆంధ్రజ్యోతిలో ఇందుకు సంబంధించిన వార్తలు ప్రముఖంగా రావడం.. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడం వల్ల భారత రాష్ట్ర సమితి ఖమ్మం నగర అధ్యక్షుడు జైలు పాలయ్యాడు.. అంటే వెలుగులోకి వచ్చింది ఇది మాత్రమే. ఇంకా రావాల్సినవి చాలా.. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమ అక్రమాలను తవ్వుతోంది కాబట్టే కేటీఆర్ మండిపోతున్నారా? శునకపు సింహాసనం పద్యాన్ని అందుకే పోస్ట్ చేశారా? కానీ ఇదే కేసీఆర్ తెలంగాణకు కాపలా కుక్క గా ఉంటా అన్నారు. అలాంటప్పుడు కేటీఆర్ పెట్టిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించయి ఉంటుంది?!