CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. గులాబీ బాస్ కేసీఆర్ నిత్యం మూడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు నెల ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ బాస్.. మేనిఫెస్టోను కూడా ముందే ప్రకటించారు. ప్రచారం కూడా విపక్షాల కంటే ముందే మొదలు పెట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రచారం చేశారు.
నాలుగు సభల్లో…
కేసీఆర్ సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, మక్తల్, నారాయణపేట్, గద్వాల్ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. దేవరకద్రకు 12:30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉండిపోయారు. మరో హెలికాప్టర్ కోసం ఏవియేషన్ అధికారులు మరో హెలిక్యాప్టర్ సమకూర్చడంతో ప్రచారానికి బయల్దేరారు.
గద్వాలలో మనసులో మాట…
ఏడాది క్రితం వరకు కేసీఆర్, బీజేపీ మధ్య తెలంగాణలో హోరాహోరీ పోరు నడిచింది. కేసీఆర్, బండి సంజయ్ నువ్వా నేనా అన్నట్లుగా మాటలు, విమర్శల తూటాలు పేల్చారు. కేంద్రాన్ని బంగాళాఖాతంలో కలుపుతానని కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ కూడా పెట్టారు. కానీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. బద్ధ శత్రువుల్లా వ్యవహరించిన బీజేపీ–బీఆర్‌ఎస్ ఇప్పుడు ఒక్కటయ్యాయన్న భావన తెలంగాణలో నెలకొంది. లిక్కర్ కేసు కోసం కేసీఆర్ మోదీతో సయోధ్య కుదుర్చుకన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు లిక్కర్ కేసులు అందరూ అరెస్ట్ ఆయ్యారు. కవిత మాత్రం అరెస్ట్ కాకపోవడంతో బీజేపీ నేతల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగా ఇటీవల పార్టీలో చేరిన వారు మళ్లీ బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే, గద్వాల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన కేసీఆర్ మనసులోని మాట బయటకు తన్నుకు వచ్చింది. బీజేపీ వెనుక బీఆర్‌ఎస్ ఉంది అని ఫ్లోలో అనేసిన కేసీఆర్.. వెంటనే దానిని సరిచేసుకున్నారు. కానీ, అప్పటికే కెమెరాల్లో ఆ మాట రికార్డు అయింది.
సోషల్ మీడియాలో వైరల్..
అభ్యర్థులు పార్టీల గురించి ఆలోచించి ఓటు వేయాలని మాట్లాడుతూ కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వెనుక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థి వెనుక బీఆర్‌ఎస్, ‘‘బీజేపీ వెనుక బీఆర్‌ఎస్’’ అంటూ ఫ్లోలో అనేశారు. ఇప్పుడు ఇదే క్లిప్పింగ్‌ను విపక్షాలు నెట్టింట్లో వైరల్ చేస్తున్నాయి. కేసీఆర్ మనసులో ఉన్న మాట.. వారి మధ్య ఒప్పందం ఇలా బయటపడిందని పేర్కొంటున్నారు. నెటిజన్లు కూడా బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య సంబంధం ఉందని కామెంట్ పెడుతున్నారు. మరోవైపు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మోదీ, కేసీఆర్ గురించి ఓ సీక్రెట్ చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తన వద్దకు వచ్చిన కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికి సహకరించారని కోరారని వెల్లడించారు. ఇంత అభాండం వేసినా కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. దీంతో బీజేపీ–బీఆర్‌ఎస్‌మైత్రి నిజమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.