Subhash Chandra Bose : ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తెప్పించాలని చంద్రబోస్ ఏకైక కూతురు అనితా బోస్ కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆగస్టు 18న నేతాజీ వర్ధంతి ఉన్నందున ఆరోజు నాటికి అస్థికలను భారత్‌కు తీసుకురావాలని కోరారు. నేతాజీ మనుమడు చంద్రకుమార్‌బోస్ కూడా తాత అస్థికలను భారత్‌కు తెప్పించాలని విజ్ఞప్తి చేశాడు. బోస్ అస్థికలను తీసుకువచ్చి తమకు అప్పగిస్తే వాటితో తాము హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిరర్వహిస్తామని లేఖలో తెలిపారు. తాను కూతురుగా తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బోష్ చివరి కోరిక కూడా ఇదే అని వెల్లడించారు. నేతాజీకి సంబంధించిన అన్ని రహస్య పత్రాలు బయటపెట్టడానికి మోదీ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. నేతాజీ మరణంపై ఉన్న మిస్టరీని మోదీ ప్రభుత్వం ఛేదించింది. కేంద్రం చేపట్టిన దర్యాప్తులో నేతాజీ 1945, ఆగస్టు 18న మరణించినట్లు నిర్ధారణ అయింది. విమాన ప్రమాదంలోనే బోస్ మరణించినట్లు ధ్రువీకరించారు. అయితే బోస్ అస్థికలు జపాన్‌లోని రెంకోజి ఆలయంలో ఉంచారని దర్యాప్తు నివేదికల్లో పేర్కొన్నారు.
భారతీయుడి అస్థికలు భారత దేశంలోనే..
నేతాజీ భారతీయుడని, ఆయన అస్థికలు భారత దేశ మట్టిలోనే కలిసిపోవాలని అనితాబోస్, చంద్రకుమార్‌బోస్ కోరుకుంటున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుడి అస్థికలు జపాన్‌లో ఉంచడం అవమానకరమని లేఖలో పేర్కొన్నారు. స్వతంత్ర బారత దేశాన్ని కోరుకున్న నేతాజీ అస్థికలను మనదేశంలో ఉంచడమే శ్రేయస్కరమని తెలిపారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.
అవి బోస్ అస్థికలేనా?
బోస్ అదృశ్యంపై మిస్టరీ ఇన్నాళ్లయినా వీడలేదు.. వీడదు కూడా! మిస్టరీని మన రాజకీయ నాయకులు జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రం నేతాజీని తెరముందుకు తెచ్చి పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు. నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఒక పాత్రలో ఉందని, దాని సంరక్షణకు భారతప్రభుత్వం అద్దె చెల్లిస్తోందని తెలుసు. ఆయన అస్థికలుగా చెబుతున్న వాటికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు ఆ ఆలయ పూజారి అనుమతి ఇచ్చారని నేతాజీ సోదరుడు శరత్ చంద్రబోస్, మనవరాలు మాధురీ బోస్ తెలిపారు. 2005లోనే ఈ మేరకు లేఖ రాశారని చెబుతున్నారు. బోస్ మరణంపై అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన ముఖర్జీ కమిటీ దాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నది మాధురీ బోస్ ప్రశ్న. ముఖర్జీ నివేదికలో దాని ఊసే లేదని తెలిపారు. డీఎన్‌ఏ టెస్ట్‌లకు సంబంధించి రెంకోజీ ఆలయ అధికారులు మౌనం వహించడంతో తాము ముందుకు వెళ్లలేకపోయామని ముఖర్జీ కమిషన్ పేర్కొంది. అది నిజం కాదంటున్నారు మాధురి. జపాన్ భాషలో ఉన్న పూజారి లేఖను అనువదించి చూశామని, అందులో డీఎన్‌ఏ టెస్ట్‌కు తాను అనుమతి ఇస్తున్నానని పూజారి స్పష్టంగా పేర్కొన్నట్టు ఉందని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే ముఖర్జీ కమిటీ నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని తెలిపింది. దీంతో ఆయన మరణంతోపాటు ఆలయంలో ఉన్న అస్థికలపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మోదీ ప్రభుత్వం అస్థికలు నేతాజావే అని నిర్ధారించింది. వీటిపి 1976లో భారత ప్రభుత్వం తెచ్చే ఆలోచన చేసినప్పుడు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేశ్వర్ ఇదే విషయాన్ని చెప్పారు. 2007లో ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఈ ఆలోచన వచ్చినా ఎందుకో జడిశారు. మరి ఈసారైనా కేంద్రం అస్థికలు తెప్పిస్తుందో లేదో చూడాలి.