
తెలంగాణ సరిహద్దుల ఆంధ్ర అంబులెన్స్ లను అడ్డుకోవడం రాజకీయ ఎత్తుగడ అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న వేడి ప్రస్తుతం కనిపించడంలేదు. అందుకే టీఆర్ఎస్ ఏదో ఒకటి ప్రజలను దారి మళ్లించాలనే తలంపుతోనే అంబులెన్స్ లను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ర్ట హైకోర్టు సైతం చీవాట్లు పెట్టడంతో చేసేది లేక దారి వదిలారు. ఆరోగ్య పరిరక్షణలో అందరికీ అవకాశం ఇవ్వాల్సిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారెవరైనా ప్రాణదానం చేయడం గొప్ప విషయం. ఈ విషయం మరిచిపోయి రాజకీయ దురుద్దేశంతో వారిని రాకుండా చూడడం అవివేకం.
ఎదురుదెబ్బ తగలడంతో..
జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడంతో గులాబీ దళం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇదే అదనుగా ఆపద సమయంలో అంబులెన్స్ లను అడ్డుకోవవాలని భావించింది. దీంతో తెలంగాణ సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పథకం వేసింది. కానీ పథకం కాస్త తుస్సుమంది. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్, నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కారు పార్టీ ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. దీనికి తోడు ఈటల రాజేందర్ వ్యవహారంతో ప్రతిష్ట గంగలో కలిసింది. దీంతో పార్టీని లేపే కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు పలు విషయాలపై తర్జనభర్జన పడుతున్నారు. పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఉవ్విళ్లూరుతున్నారు అందులో భాగంగానే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని భోగట్టా.
టీఆర్ఎస్ వైఖరితో ఆందోళన
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న సెటిలర్లలో ఆందోళన నెలకొంది. గతంలో సైతం వారు గులాబీ పార్టీ వెంటే ఉండి వారికే ఓటు వేశారు. తీరా ఇప్పుడు అంబులెన్స్ లను అడ్డుకోవడంతో తమ భవితవ్యం ఏమిటని భయాందోళన చెందుతున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం సెటిలర్లు కారుకే ఓటు వేసి గెలిపించారు. బీజేపీ, కాంగ్రెస్ లకు వేయకుండా గులాబీనే నమ్ముకున్నారు. ఇప్పుడు అంబులెన్స్ లను అడ్డుకోవడంతో తమ గతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు నమ్ముకున్న వారే నట్టేట ముంచుతున్నారని ఆందోళన చెందుతున్నారు. తమ భవిష్యత్తు ఏమిటని కంగారు పడుతున్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో..
హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర లేదా అని అడుగుతున్నారు. భాగ్యనగరాన్ని బాగు చేసిందే మేం. మాకు ఇంత అన్యాయమా అని మథనపడుతున్నారు. మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారడానికి కారణం మేం కాదా అంటున్నారు. అలాంటి మాకు వైద్యం అవసరం అయితే రానివ్వరా అని దిగులు చెందుతున్నారు. ఏది ఏమైనా సెటిలర్లలో ఆందోళన మొదలైందనే చెప్పాలి. వారిని రానివ్వకుండా చేయడంతో వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలని రోదిస్తున్నారు. ఆపద కాలంలో ఆదుకోవాల్సింది పోయి అడ్డుకోవడమేమిటని ఆవేశాన్ని వెల్లగక్కుతున్నారు.