MLA Rathod Bapurao: ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అవకాశాల కోసం నేతలు వేగంగా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. అయితే ఈ జాబితాలో అధికార భారత రాష్ట్ర సమితి ఉండటం విశేషం. మొన్నటిదాకా ఇతర పార్టీల నుంచి నాయకుల రాకతో భారత రాష్ట్ర సమితి మాంచి దూకుడు మీద ఉండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీ నే బాధిత జాబితాలోకి వెళ్లిపోతోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు నుంచి కేటీఆర్ వరకు చెబుతున్నారు. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తామని ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆ విధంగా లేదు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో బాపూరావు అధికార భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే మొన్న కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఆస్థానాన్ని నేరడిగొండ జెడ్పిటిసి సభ్యుడు అనిల్ కుమార్ జాదవ్ కు కెసిఆర్ కేటాయించారు. అప్పటినుంచి బాపూరావు అధిష్టానం మీద ఆగ్రహంగా ఉన్నారు. తన బాధను చెప్పుకుందామని అపాయింట్మెంట్ కోరితే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దీనికి తోడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆయన మీద ముద్ర వేయడంతో ఆత్మ న్యూనతకు గురవుతున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండుకుంటూ వస్తున్నారు. దీంతో ఆయన అనుచరుల ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే బాపూరావు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాపూ రావు భారత రాష్ట్ర సమితిని వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తన కార్యకర్తలతో సమావేశం నిర్వహించగా, వారు కూడా ఇదే ఉద్దేశాన్ని ప్రకటించినట్లు సమాచారం. త్వరలో ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు.. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం సీటు కేటీఆర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్ కు భారత రాష్ట్ర సమితి కేటాయించింది. దీంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడినట్టు సమాచారం. మరోవైపు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. త్వరలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది.. మొత్తానికి మొన్నటిదాకా అపరిమితమైన బలంతో కనిపించిన భారత రాష్ట్ర సమితి.. ఎన్నికలకు ముందు ఇలా ఇబ్బందులకు గురి కావడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తున్నది.