YCP MLA: ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు భారీ ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ పై ఓ యువకుడు డిటోనేటర్ తో దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్నారాయణ పాల్గొన్నారు. కాన్వాయ్ దిగి నడిచి వెళుతున్న క్రమంలో ఓ యువకుడు డిటోనేటర్ తో దాడి చేశాడు.
మద్యం మత్తులో ఓ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కారుపై డిటోనేటర్ విసిరే క్రమంలో అది పొలాల్లో పడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో డిటోనేటర్ పేలనట్లు పోలీసులు గుర్తించారు. డిటోనేటర్ విసిరిన యువకుడ్ని చుట్టుపక్కల ఉన్నవారు పట్టుకున్నారు. సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గణేష్ గా పోలీసులు గుర్తించారు. ఆయన క్వారీ కార్మికుడని… మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనతో శంకర్ నారాయణ షాక్ కి గురయ్యారు. తనపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు తేలాల్సి ఉందన్నారు. ఈ కుట్ర కోణాన్ని పోలీసులు చేదించాలని డిమాండ్ చేశారు. దేవుడు దయతోనే తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని శంకర్ నారాయణ భావోద్వేగంగా చెబుతున్నారు. తనకు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కుట్ర కోణాన్ని ఛేదించి నిందితులను పట్టుకోవాలని పోలీసులను కోరారు. కాగా ఈ ఘటనతో రాయలసీమలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.