Shah Rukh Khan Visit Tirumala: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుటుంబ సమేతంగా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. హిందూ సంప్రదాయ దుస్తుల్లో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. షారుక్ తో పాటు భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఉన్నారు. వీరంతా కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు షారుక్ ఖాన్ కు వేద ఆశీర్వచనాలు అందించారు. అంతకుముందు షారుక్ కు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ కుటుంబం తిరుమలను దర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి షారుక్ ముస్లిం. తొలిసారిగా ఆయన హిందూ దేవాలయమైన తిరుమలను సందర్శించారు. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ షారుక్.. తిరుమల దర్శనంతో నువ్వు అసలైన సెక్యులర్ వి. నీ జవాన్ సినిమా విశేష ప్రేక్షక ఆదరణ పొందుతుంది. అంటూ ట్విట్ చేస్తున్నారు. షారుక్ ఖాన్, నయనతార కలిసి తాజాగా నటించిన చిత్రం జవాన్. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే షారుక్ కుటుంబంతో కలిసి నయనతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
కుటుంబ సమేతంగా షారుక్ తిరుమల రావడంతో.. వారిని చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. వారితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. కాగా జవాన్ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పటాన్ వంటి భారీ హిట్టు కొట్టిన షారుక్.. జవాన్ తో మరో హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు బలంగా ఆశిస్తున్నారు. తిరుమల శ్రీవారి కరుణాకటాక్షాలతో జవాన్ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.