LB Nagar Attack: ప్రాణాపాయం లేదు. కాని లేచి నడవలేదు. వెన్నెముక దెబ్బతిన్నది. గర్భాశయం తీవ్రంగా గాయపడింది. నరాలు పనిచేయడం మానేశాయి. ఇదీ ప్రేమోన్మాది శివ చేతిలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని సంఘవి ఆరోగ్య పరిస్థితి. ఆమెకు ప్రాణాపాయం లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో మంచం నుంచి కిందికి దిగే అవకాశాలు గాని, లేచి నడిచే సౌలభ్యం గాని ఆమెకు ఉండకపోవచ్చు అని వైద్యులు అంటున్నారు.
శివ చేతిలో కత్తిపోట్లకు గురైన తర్వాత సంఘవిని గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. వెన్నెముక, గర్భాశయం వద్ద తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఇకపై సాధారణ జీవితం గడపలేకపోవచ్చని ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్, చీఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నాగేశ్వర్రెడ్డి చెబుతుండడం గమనార్హం. సంఘవిని ఆసుపత్రికి తీసుకువచ్చిన నాటి నుంచి ట్రామా కేర్ బృందం న్యూరో సర్జన్లు, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ ఫిజీషియన్లు ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారు. సంఘవి ముఖం మీద శివ విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆ గాయాలకు వైద్యులు కుట్లు వేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా గర్భాశయ, వెన్నుపూస ప్రాంతాల్లో నరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సంఘవి కి ఇంకా కొన్ని శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. సంఘవిని తమ ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిన తర్వాత కూడా చికిత్స అందజేస్తామని చెబుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే
బాల్య స్నేహితురాలు అయిన సంఘవిని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని పట్టుదలతో ఆమె ఇంటికి వచ్చి శివకుమార్ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఫరూక్నగర్ మండలం నేరెళ్ల ప్రాంతానికి చెందిన శివకుమార్, కొందుర్గు మండలానికి చెందిన సంఘవి పదో తరగతి దాకా కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత శివకుమార్ రామంతపూర్ లో ఉంటూ ఆర్టిస్టుగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సంఘవి రామంతపూర్ లోని ఒక కళాశాలలో హోమియోపతిలో నాలుగవ సంవత్సరం చదువుతోంది. ఇద్దరూ పదో తరగతి కలిసి చదువుకోవడంతో.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. శివ కుమార్ తో వ్యవహారం తెలవడంతో సంఘవిని ఇంట్లో వాళ్ళు మందలించారు. పెద్దవాళ్లకు ఇష్టం లేకపోవడంతో సంఘవి కొద్ది రోజులుగా శివకుమార్ ను దూరం పెట్టింది. ఎలాగైనా సంఘవిని ఒప్పించాలి అని శివకుమార్ అనుకున్నాడు. దీనికి సంబంధించి ఆమెతో మాట్లాడాలి అనుకున్నాడు. అయితే సంఘవి కి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె దగ్గర నుంచి జవాబు రాలేదు. ఆదివారం 11 గంటలకు శివ తన పిన్ని కూతురుతో కలిసి ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలోని సంఘవి ఇంటికి వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని సంఘవిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. పెద్దలకు ఇష్టం లేదని, పెళ్లి చేసుకోవడం కుదరదని సంఘవి చెప్పడంతో పిన్ని కూతురుతో కలిసి వెళ్లిపోయాడు.
అదేరోజు మధ్యాహ్నం
ఇక అదేరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సంఘవి ఇంటికి శివ మళ్ళీ వచ్చాడు. అప్పుడు ఇంట్లో సంఘవి, ఆమె తమ్ముడు పృథ్వి మాత్రమే ఉన్నారు. మరో సోదరుడు రోహిత్, బంధువుల ఊరికి వెళ్ళాడు. శివకుమార్ వచ్చినప్పుడు ఇంట్లో హాల్లో కూర్చున్న పృద్వి ఫోన్లో ఆడుకుంటున్నాడు. సంఘవిని తీసుకొని బెడ్ రూమ్ లోకి వెళ్లిన శివ ఆమెతో పెళ్లి విషయాన్ని మరోసారి ప్రస్తావించాడు. కొద్దిసేపటికి ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది..” నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకో. లేకుంటే నీ చేతులతో నన్ను చంపేయి” అంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అయితే ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో బయట హాల్లో ఉన్న పృద్వి.. బెడ్ రూమ్ లోకి వెళ్లి శివతో గొడవపడ్డాడు. దేశంలో ఉన్న శివ.. పృద్వి చాతిలో పొడిచాడు. భయపడిపోయిన సంఘవి.. దాడి చేయవద్దంటూ శివ కాళ్ళ మీద పడింది. నువ్వు చెప్పినట్టే వింటా, నిన్నే పెళ్లి చేసుకుంటానని శివ కాళ్ళ మీద పడింది. అయినప్పటికీ ఆవేశం చల్లారని శివ.. సంఘవి మీద విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పృథ్వి పెద్దగా అరుచుకుంటూ వీధిలోకి వచ్చాడు. తన అక్కను శివ చంపేస్తున్నాడు అంటూ పక్క పోర్షన్ మహిళలకు చెప్పాడు. ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెడుతూ రోడ్డుపై కుప్ప కూలి మృతి చెందాడు. సంఘవి తండ్రి సురేందర్ గౌడ్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై 302, 307, 354డీ, 448 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శివను రిమాండ్ కు తరలించారు.