Blackout Siren : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. బ్లాక్‌అవుట్ వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కారు నడుపుతుండగా బ్లాక్‌అవుట్ సైరన్ మోగితే ఏం చేయాలి? భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా ఉండవచ్చు. అవేంటో ఈ వార్తలో తెలుసుకుందాం.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. భారత ప్రభుత్వం ఇప్పటికే అలాంటి ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ వంటి చర్యల ద్వారా రక్షణ పొందేందుకు సూచనలు జారీ చేసింది. గత మూడు రోజులుగా అనేక ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కారు నడుపుతుండగా బ్లాక్‌అవుట్ సైరన్ మోగితే ఏమి చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది.
బ్లాక్‌అవుట్ సైరన్ మోగడం అంటే యుద్ధం, వైమానిక దాడి లేదా పెద్ద ప్రమాదం ఏర్పడే ఎమర్జెన్సీ అని అర్థం. అలాంటి సమయంలో వెంటనే అప్రమత్తంగా ఉండాలి. శత్రువులకు లక్ష్యాలు కనిపించకుండా నగరంలోని లైట్లను ఆపివేయడమే బ్లాక్‌అవుట్ ముఖ్య ఉద్దేశం. మీరు డ్రైవ్ చేస్తుండగా బ్లాక్‌అవుట్ సైరన్ మోగితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు తెలివిగా వ్యవహరించాలి.
కారు నడుపుతున్నప్పుడు ఏమి చేయాలి?
మీరు కారు నడుపుతుండగా హఠాత్తుగా బ్లాక్‌అవుట్ సైరన్ మోగితే, వెంటనే మీ వాహనాన్ని సురక్షితమైన ప్రదేశంలో ఆపాలి. అది రోడ్డు పక్కన ఉండవచ్చు. ఆ ప్రదేశం సురక్షితంగా ఉండాలి. ఇతరులకు ఆటంకం కలిగించకూడదు. వీలైతే గ్యారేజ్ లేదా పైకప్పు ఉన్న ప్రదేశంలో ఆపండి. సైరన్ మోగిన వెంటనే హెడ్‌లైట్లు, అన్ని లైట్లను ఆపివేయండి. లోపల, వెలుపలి లైట్లు అన్నీ బంద్ చేయాలి. టార్చ్ కూడా ఉపయోగించకూడదు. ఒకవేళ కారు ఆపడానికి వీలు కాకపోతే హెడ్ లైట్‌ను హై బీమ్ నుండి లో బీమ్‌కు మార్చండి. తద్వారా బయటి వెలుతురు తగ్గుతుంది.
సురక్షితమైన ప్రదేశం లేకపోతే ఏమి చేయాలి?
బ్లాక్‌అవుట్ సైరన్ మోగిన వెంటనే కారు ఇంజిన్‌ను ఆపివేయడానికి ప్రయత్నించండి. బయట సురక్షితమైన ప్రదేశం కనిపించకపోతే కారులోనే ఉండండి. కిటికీలు మూసి ఉంచండి. దగ్గరలో బంకర్ లేదా బలమైన భవనం ఉంటే అందులోకి వెళ్లండి. ఈ సమయంలో రేడియో లేదా ప్రభుత్వ అత్యవసర ఛానెల్‌ను ఆన్ చేయండి. తద్వారా తదుపరి సూచనలు తెలుసుకోవచ్చు. భయపడవద్దు. బ్లాక్‌అవుట్ అంటే ఎల్లప్పుడూ దాడి అని కాదు. ఇది ఒక ట్రైనింగ్ కూడా కావచ్చు.
Also Read : భారత్–పాక్ యుద్ధం.. మనకు మిత్రులెవరో.. శత్రువులెవరో తెలిసింది