తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ ఫంగస్ గతం నుంచే ఉన్నప్పటికీ.. కొవిడ్ బాధితులపై ప్రభావం చూపుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. అప్పటికే కరోనా అవస్థల నుంచి కోలుకున్నవారిపై ఈ వైరస్ తీవ్రంగా దాడిచేస్తుండడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో సోమవారం ఈ ఫంగస్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 16 మంది, కోఠి ఈఎన్ టీ ఆసుపత్రిలో 25 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు ఫంగస్ బారిన పడి 10 మంది మరణించారు. సోమవారం మృతిచెందిన వారిలో నిజామాబాద్ జిల్లాకు చెందినవారు ముగ్గురు ఉండగా.. నల్గొండ జిల్లాకు చెందినవారు ఒకరు ఉన్నారు.
ఈ ఫంగస్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కోఠి ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించింది. తాజాగా.. గాంధీ ఆసుపత్రిలోని ఈఎన్టీ విభాగాన్ని కూడా ఫంగస్ బాధితుల కోసం వినియోగించాలని నిర్ణయించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న రోగులకు ఆపరేషన్ నిర్వహించేందుకు ఇక్కడ ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల్లో చికిత్స కూడా ప్రారంభమవుతుందని సమాచారం.
బ్లాక్ ఫంగస్ అనేది కొత్తది కాదని.. గతంలోనూ ఉందని గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇది వరకు కూడా ఈ ఫంగస్ తో బాధపడేవారు ఇక్కడ చికిత్స పొందారని తెలిపారు. అయితే.. కరోనా నేపథ్యం కావడం వల్ల ప్రాధాన్యత సంతరించుకుందని చెబుతున్నారు. కొవిడ్ పేషెంట్లకు స్టెరాయిడ్లు ఎక్కువగా ఇచ్చినప్పుడు.. వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, అలాంటి వారిపై ఫంగస్ అటాక్ చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రధానంగా డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక రోగులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల వారిపై ఈ ఫంగస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల కొవిడ్ పేషెంట్లకైనా మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ఇక, ఆక్సీజన్ అందించేప్పుడు సాధారణ నీటిని వాడొద్దని, స్టెరైల్ వాటర్ ను మాత్రమే వినియోగించాలని చెబుతున్నారు. ఇలాంటి చర్యల ద్వారా బ్లాక్ ఫంగస్ కు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు నిపుణులు.