Manipur : కుకి, మైతేయి వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఈ రెండు వర్గాలు ఘర్షణ పడుతున్న నేపథ్యంలో వందలాది మంది చనిపోయారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.. కేంద్ర బలగాలు అక్కడ పహారా కాస్తున్నప్పటికీ శాంతిభద్రతలు ఇంకా అదుపులోకి రాలేదు.. దీంతోపాటు మణిపూర్ రాష్ట్రానికి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన బీరేన్ సింగ్(Beeren Singh) ఓ వర్గానికి కొమ్ముకొస్తున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ చెందిన ఎమ్మెల్యేలు కూడా అదే పల్లవి అందుకున్నారు. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే ఎమ్మెల్యేలు విప్ ను సైతం ధిక్కరించే ప్రమాదం ఉండడంతో.. బిజెపి అధిష్టానం రంగంలోకి దిగింది. దీంతో బీరేన్ సింగ్ రాజీనామా చేయక తప్పలేదు. ఇటీవల ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేశారు. దానికంటే ముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఆయన భేటీ అయ్యారు. అమిత్ షా సూచనలతోనే బీరెన్ సింగ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.. విశ్వాస పరీక్ష పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన ఒకరోజు ముందుగానే.. బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకోవడంతో మణిపూర్ రాజకీయాలలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఈ క్రమంలో తదుపరి సీఎం ఎవరు అనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది. అయితే కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తారని.. మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులను బిజెపి అధిష్టానం చక్క దిద్దుతుందని అందరూ భావించారు. కానీ గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రపతి పాలన
మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2023 నుంచి మణిపూర్ రాష్ట్రంలో ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. మైతేయి, కుకీ వర్గాలు హోరాహోరీగా ఘర్షణ పడుతున్నాయి. అంతకంతకు హింస పెరుగుతున్న నేపథ్యంలో.. రెండు వర్గాల వారు చనిపోతున్న నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రపతి పరిపాలన విధించాలని గతంలోనే కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు కూడా పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే విషయంపై నిలదీశాయి. అయితే ఇన్ని రోజులకు కేంద్రం మణిపూర్ ప్రాంతంలో రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీరును స్వాగతిస్తున్నాయి. ఇప్పటికైనా జన బాహుళ్య కోణంలో ఆలోచించారని.. ఇదే ఆలోచన ముందే చేసి ఉంటే మణిపూర్ అలా మండిపోయేది కాదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈశాన్య రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bjps sensational decision to impose presidents rule in manipur
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com