Gujarat Assembly Election Results: 2017లో గుజరాత్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు 99 స్థానాలు సాధించారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 156 కు చేరుకుంది. (ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో మెజారిటీ కాస్త అటూ ఇటూ మారవచ్చు.)
సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్, గాంధీనగర్, అహ్మదాబాద్.. ఇలా ఏ ప్రాంతం చూసినా కమల వికాసమే. అయితే ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన స్థానాలు దక్కించుకుంటుందని… కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవాన్ని సాధిస్తుందని అందరూ ఊహించారు. ఒక సెక్షన్ మీడియా సంస్థలు అయితే డిబేట్ల తో హోరెత్తించాయి. కానీ ఫలితం దాకా వచ్చేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిరుడు 99 స్థానాల్లో గెలుపొందిన బిజెపి… ఈ సంవత్సరం ఏకంగా 153 స్థానాల్లో పాగా వేసింది. నిరుడు 78 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీని 17కు పరిమితం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాల దగ్గరే కొట్టుమిట్టాడింది. గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఐదు స్థానాల్లోనే విజయం సాధించింది.

మోడీని ఎందుకు నమ్మారు
2014 లో నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రి అయిన తర్వాత గుజరాత్ రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. అయినప్పటికీ కూడా ప్రధాని మోది బొమ్మనే ముందు వరుసలో పెట్టి బిజెపి ప్రచారం చేసింది. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మోడీ చరిష్మాను ప్రతి గడపకు తీసుకెళ్లింది. ముఖ్యంగా 2017లో పాటీదారుల ఉద్యమం బిజెపి మెజార్టీని తగ్గించింది. కానీ ఈసారి ఆ తప్పిదం మళ్లీ జరగకుండా బిజెపి ముందు జాగ్రత్త పడింది. పాటీదారులలో నాయకులను తన పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెసులో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులను కూడా పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇచ్చింది.. దీంతో బిజెపికి బలమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఫలితంగా ప్రజలు కూడా మరోసారి కమలానికే జై కొట్టారు..
వెల్లువలా పెట్టుబడులు
గుజరాత్ సొంత రాష్ట్రం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టారు. గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో అన్ని తానై వ్యవహరించారు. ముఖ్యంగా లక్షలాది కోట్ల పెట్టుబడులను గుజరాత్ రాష్ట్రానికి మళ్ళించారు. ప్రతిపక్షం బలంగా లేకపోవడంతో బిజెపి నాయకులు దూకుడు ప్రదర్శించారు. సోషల్ మీడియాలోనూ దుమ్మురేపారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ బిజెపి ఆచితూచి వ్యవహరించడంతో గెలుపు సులభమైంది.. చాలామంది సిట్టింగులకు ఈసారి టికెట్లు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే దానికి ఆస్కారం లేకుండా పోయింది. పట్టణ ప్రాంత ఓటర్లను ఆమ్ ఆద్మీ పార్టీ కొంతమేర ప్రభావితం చేయగలిగినప్పటికి, హిందుత్వ విధానాన్ని ప్రచారం చేసుకున్నప్పటికీ బిజెపి దానిని నిలువరించగలిగింది. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణం, సత్యేంద్రజైన్ తీహార్ జైల్లో అనుభవిస్తున్న సౌకర్యాలు, పాఠశాల భవన నిర్మాణాల్లో చోటు చేసుకున్న అవినీతిని బిజెపి ప్రముఖంగా ప్రచారం చేసింది. దీనివల్ల మోర్బీ వంతెన ప్రమాదం గుజరాతి ఓటర్లకు గుర్తు లేకుండా పోయింది.

కలిసి వచ్చిన అభివృద్ధి మంత్రం
వర్తమాన రాజకీయాల్లో అమిత్ షా, నరేంద్ర మోడీ ఎంత చాణక్యులో చెప్పాల్సిన అవసరం లేదు.. కానీ ఈసారి టికెట్లు కేటాయింపులో ఓ స్వతంత్ర సర్వే చేసిన వివరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజల సమస్యలు పరిష్కరించే వారికే ఈసారి టికెట్లు ఇచ్చారు. బిజెపి సాధించిన మొదటి విజయం ఇది. తర్వాత ప్రత్యర్థి పార్టీల్లో కీలక నేతలను చేర్చుకొని వారిని కోలుకోకుండా చేసింది ఇది బిజెపి సాధించిన రెండో విజయం. ఇక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి భారీగా పెట్టుబడి వచ్చేలా చేయడంతో ఓటర్లు ఈసారి కూడా నమ్మారు. ఇది బిజెపి సాధించిన మూడో విషయం. పోల్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా ప్రచారం పకడ్బందీగా జరిగేలా చేసింది.. ఇది బిజెపి సాధించిన నాలుగో విజయం . ఇలా నాలుగు విధాలుగా ఎన్నికల ప్రక్రియను విభజించుకొని తన కంచుకోట అయిన రాష్ట్రాన్ని బిజెపి మరోసారి నిలబెట్టుకుంది. వరుసగా ఏడోసారి అధికారాన్ని చేజిక్కించుకొని వామపక్షాల సరసన నిలబడింది.