BJP Janasena: ఏపీలో అధికారం సాధించడమే ధ్యేయంగా బీజేపీ బిగ్ స్కెచ్ వేసింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా ఏకంగా ‘రాజధానికే’ గురిపెట్టింది. ఏపీలో తీరని కోరికగా ఉన్న రాజధాని నిర్మాణంపై పెద్ద హామీ ఇచ్చింది. ఏపీలో బీజేపీ కనుక పొత్తులోనైనా? ఒంటరిగానైనా అధికారంలోకి వస్తే రెండేళ్లలోనే రాజధాని నిర్మిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. కేవలం రెండేళ్లలోనే రాజధానిని ఏపీ ప్రజలకు కానుకగా ఇస్తామన్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు అవుతున్న సందర్భంగా సోము వీర్రాజు స్పందించారు. ఈ క్రమంలోనే అంటీముట్టనట్టుగా ఉంటున్న జనసేన-బీజేపీ సంబంధాలపై కూడా సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికీ ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయని.. ఇరు పార్టీల వ్యూహాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదని సోము వీర్రాజు వ్యూహాత్మక సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి ఈ రెండు పార్టీలు పొత్తులోనే ఉన్నాయని.. అవసరార్థం ఏపీలో రాజకీయం చేస్తాయని చెప్పకనే చెప్పారు.
ఇక ఏపీలో బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని సోము వీర్రాజు ప్రకటించారు. అయితే ఎప్పుడు, ఎలా చేస్తామన్నది మాత్రం సోము బయటపెట్టకుండా ట్విస్ట్ ఇచ్చాడు. ఏపీ సీఎం జగన్ కు కేసుల దృష్ట్యా ఒకవేళ ఆ కేసుల్లో జగన్ జైలుకు వెళితే.. డమ్మీ సీఎంను కుర్చీలో కూర్చుండబెట్టి తమిళనాడులోని గత అన్నాడీఎంకే ప్రభుత్వంలా బీజేపీ ఆడిస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు ఏపీలో అందివచ్చే అవకాశాలున్నాయి. ఒకటి జగన్ పై కేసులు.. రెండు చంద్రబాబుకు వయసైపోవడం.. దీంతో ప్రత్యామ్మాయ రాజకీయ శక్తిగా మారేందుకు బీజేపీ-జనసేన కూటమికి ఇది సదావకాశం. ఈ కోణంలోనే బీజేపీ ఆలోచిస్తున్నట్టు సోమువీర్రాజు మాటలను బట్టి తెలుస్తోంది.
ఏపీలో రాజ్యాధికారం లక్ష్యంగా యాత్రలు ప్రారంభించబోతున్నట్టు సోము వీర్రాజు ప్రకటించారు. ఈనెల 29 నుంచి ఈ యాత్రలు సాగబోతున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల వరకూ ప్రజల్లోకి యాక్టివ్ గా వెళ్లి గెలుపునకు బాటలు వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఇలా జనసేనతో వ్యూహాత్మక పొత్తుతో వెళుతూనే ఏపీలో రాజధాని పూర్తి చేయడం.. రాజ్యాధికారం లక్ష్యంగా బీజేపీ రాబోయే రెండేళ్లలో ఏదో చేయబోతోందన్న సంకేతాలను సోము వీర్రాజు ఇచ్చారు. ఇవిప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.