తెలంగాణ బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు ప్రజల్లోకి వెళుతోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లు యాత్రలు చేపడుతున్నారు. మొదటగా పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ‘జన ఆశీర్వాద్ యాత్ర’కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 19 నుంచి 21 వరకు కోదాడ నుంచి హైదరాబాద్ వరకు ఈ యాత్ర చేపట్టనుంది. జి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఆగస్టు 19 నుంచి కోదాడలో ప్రారంభమై ఆగస్టు 21న హైదరాబాదులో ముగించే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది.
ఆగస్టు 19 సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ లో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. సూర్యాపేటలో రాత్రి బస చేస్తారు. ఈ జన ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు.
మరుసటి రోజు 20వ తేదీన దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్ లో భద్రకాళి మాత దర్శనం, వరంగల్, హనుమకొండ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఖిల్లాషాపూర్ లో సర్వాయి పాపన్న గ్రామం నుంచి జనగామ, ఆలేరు, యాదగిరిగుట్ట చేరుకుంటారు. వరంగల్ లో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించి ప్రజలకు అందిస్తున్న విధానాన్ని పరిశీలిస్తారు.
ఆలేరులో పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కళాకారులు( కార్మికులు) చింతకింది మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్న అనంతరం యాదగిరిగుట్టలో రాత్రి బస చేస్తారు.
21న ఉదయం భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అందిస్తున్న ఉచిత బియ్యం విధానాన్ని ప్రజలకు చేరుతున్నాయా లేవా అనే అంశాలను రేషన్ షాప్ సందర్శించి పరిశీలిస్తారు. అనంతరం ఘట్ కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద రాత్రి 7 గంటలకు సభ ఉంటుంది.
12 జిల్లాల మీదుగా, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా, 324 కిలోమీటర్లు జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జన ఆశీర్వాద యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను తెలంగాణ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా చేసిన మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. నరేంద్ర మోడీ రైతాంగానికి లాభసాటి చేసే విధంగా విధానాలు రూపొందించడం, పేద ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ – అభివృద్ధి విషయాలను ప్రధానంగా ఈ యాత్రలో ప్రస్తావిస్తారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు..