గెలిచి ఓడిన బిజెపి

మధ్య ప్రదేశ్ రాజకీయాలు ఇంకో కర్ణాటకని గుర్తుకుతెచ్చాయి. ఈ చదరంగంలో కాంగ్రెస్ ఓడి బీజేపీ గెలిచింది. రేపోమాపో తిరిగి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఈ సారి ఇందుకు ప్రధాన కారణం జ్యోతిరాదిత్య సింధియా. తిరిగి మధ్యప్రదేశ్ లో అధికారాన్ని దొడ్డిదారిన చేజిక్కించుకోవటానికి ఒక రాజ్య సభ సీటు, కేంద్రం లో మంత్రి పదవి ఇవ్వటానికి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చటంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవటం మనం చూస్తున్నాము. వరసగా మహారాష్ట్ర, […]

Written By: Ram, Updated On : March 21, 2020 9:00 am
Follow us on

మధ్య ప్రదేశ్ రాజకీయాలు ఇంకో కర్ణాటకని గుర్తుకుతెచ్చాయి. ఈ చదరంగంలో కాంగ్రెస్ ఓడి బీజేపీ గెలిచింది. రేపోమాపో తిరిగి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఈ సారి ఇందుకు ప్రధాన కారణం జ్యోతిరాదిత్య సింధియా. తిరిగి మధ్యప్రదేశ్ లో అధికారాన్ని దొడ్డిదారిన చేజిక్కించుకోవటానికి ఒక రాజ్య సభ సీటు, కేంద్రం లో మంత్రి పదవి ఇవ్వటానికి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చటంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవటం మనం చూస్తున్నాము. వరసగా మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలు పరుల పాలుకావటంతో డీలా పడిన శ్రేణులకు ఇది ఓ టానిక్కే . అంతవరకూ అధికారపు ఆటలో విజయంగానే చూడాలి. కాకపోతే మొదట్నుంచీ ఇటువంటి కాంగ్రెస్ రాజకీయాలను వ్యతిరేకించి మోడీకి మద్దతిచ్చిన వారిలో ఈ రాజకీయ క్రీడపై అంత ఉత్సాహం లేనిమాట నిజం.

రాజకీయాల్లో రాను రాను పార్టీలమధ్య అంతరాలు తగ్గిపోతున్నాయి. జాతీయవాదం పేరుతోనో , బూటకపు సెక్యూలరిజానికి వ్యతిరేకతపేరుతోనో అధికారదాహ రాజకీయాలను సమర్ధించుకోవటం ప్రజాస్వామ్యవాదానికి చేటుచేస్తుందని మర్చిపోవద్దు. నిజమే భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వాన కాశ్మీర్ విషయం లో,దేశ రక్షణ విషయం లో అలాగే గుర్తింపు రాజకీయాల పేరుతో ఇన్నాళ్లు జరుగుతున్న ఓటు బ్యాంకు రాజకీయాల్ని విడనాడి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం లో కాంగ్రెస్ కి భిన్నంగా పనిచేస్తుంది. దానితోపాటు దేశ ఆర్ధికవిధానాల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి కృషిచేసినమాట కూడా ఎవరూ కాదనలేరు. అంతమాత్రాన అధికార రాజకీయాల్లో విలువలకు తిలోదకాలివ్వటం చాలా నిరాశ కలిగిస్తుంది. అధికారదాహ  రాజకీయాల్లో కాంగ్రెస్ కి బీజేపీ కి తేడా లేదనే భావన ప్రజల్లో రావటం కూడా చూస్తున్నాము. గుజరాత్ లో ఒక రాజ్యసభ సీటు కోసం బెంగళూరు లో క్యాంపు రాజకీయాలు నడపటం దగ్గర్నుంచి కర్ణాటక పవర్ పాలిటిక్స్ వ్యవహారం దాకా బీజేపీ కూడా కాంగ్రెస్ కి ఏమాత్రం తీసిపోని రాజకీయాలే నడిపింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా అదే జరిగింది. మహారాష్ట్ర లో శివసేన చేసింది అవకాశవాదమని చెప్పేనైతిక హక్కు బీజేపీ కోల్పోయింది. పవర్ పాలిటిక్స్ అన్ని పార్టీలు ఒకటే ననే భావం ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే ప్రజలు ఇప్పటికీ దేశరాజకీయాల్నీ సునిశితంగా పరిశీలిస్తున్నారని మరిచిపోవద్దు. లేకపోతే లోక్ సభ కు ఒకలాగా అసెంబ్లీ కి ఇంకో లాగా ఓట్లు వేయరు.

మోడీ-అమిత్ షా ద్వయం బీజేపీ ని అధికారం లోకి తీసుకొచ్చినమాట నిజం. ముఖ్యంగా 2014 లో ప్రజలు కాంగ్రెస్ అవినీతి పరిపాలనతో విసిగిపోయి మోడీ అధికారం లోకి రావాలని కోరుకున్నారు. 2019 లో జాతీయవాదం, దేశ రక్షణ ప్రధాన అంశాలుగా ముందుకొచ్చిన నేపథ్యంలో మోడీ కి తిరిగి పట్టం గట్టారు. ఇప్పటికీ మోడీ అంటే అభిమానం ప్రజల్లో వుంది. ఆ స్థాయిలో వున్న రాజకీయ నాయకుల్లో స్వంతానికి ఎంతోకొంత జేబులోవేసుకునే వాళ్ళే ఎక్కువ. సోనియా గాంధీ పరివారం అందుకు ఉదాహరణ. కానీ మోడీ నిజాయితీపరుడని ఈరోజుకీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కానీ ఈ అధికార రాజకీయ క్రీడలు చూస్తుంటే అవినీతి రాజకీయాలకి బీజేపీ కూడా అతీతమేమీ కాదని అర్ధమవుతుంది. కాకపోతే కాంగ్రెస్ అధినాయకత్వం లాగా మోడీ వ్యక్తిగతంగా అవినీతి మరకలు లేవు కానీ అధికారదాహ  రాజకీయాలకోసం అవినీతి రాజకీయాలు మాత్రం చేస్తున్నారనేది కళ్ళకు కనబడుతుంది. అంటే అధికారం కోసం ఎక్కడిదాకైనా వెళ్లటాన్ని ఏమనాలి? దీర్ఘకాలంలో ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది. మోడీ-అమిత్ షా ఈ అధికార రాజకీయ క్రీడని ఆపకపోతే ఇవ్వాళ వున్న గుడ్ విల్ రేపు బేడ్ విల్ గా మారుతుందని మరిచిపోవద్దు. ఇప్పటివరకు మోడీ-అమిత్ షా బాలన్సుషీట్ లో ప్లస్ పాయింట్లు ఎక్కువగా వున్నాయి కాబట్టి గుడ్ విల్ వుంది. కాలం గడిచేకొద్దీ పవర్ పాలిటిక్స్ డామినేట్ చేస్తే బాలన్సుషీట్ తారుమారవటం ఖాయం. ఇలా మాట్లాడుతున్నందుకు బీజేపీ శ్రేణులకు ఇబ్బందిగా వున్నా రెండో వైపు అభిప్రాయాన్ని వినటం అలవాటుచేసుకుంటే ప్రజల గుండెచప్పుడు అర్ధమవుతుంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో బీజేపీ మరో కాంగ్రెస్ పార్టీ కాకుండావుండాలంటే విలువలకు ప్రాధాన్యమిచ్చే రాజకీయాల్ని చేయాలి. అప్పుడే నిజమైన ప్రజా పార్టీగా మనుగడసాగిస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో బీజేపీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ….. సెలవు.