Telangana Assembly Elections- BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో ఐదు నెలల్లోల జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్ హ్యాట్రిక్‌పై దృష్టిపెట్టింది. విపక్ష బీజేపీ, కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గద్దె దించి తీరుతామంటున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొన్నటి వరకు దూకుడు మీద కనిపించిన బీజేపీ ఇప్పుడు రేసులో కాస్త వెనుకబడింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితి కమలనాథులకు ఇబ్బందిగా మారింది. మరోవైపు ప్రధానమైన ఐదు సవాళ్లు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. వాటిని అధిగమిస్తేనే వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నాయకత్వం..
తెలంగాణలో బీజేపీ ప్రస్తుతం నాయకత్వ సమస్య ఎదుక్కొంటోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీకి తెలంగాణలో వచ్చిన మైలేజే కారణం. బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం తెలంగాణలో వచ్చింది. ఒకానొక దశలో బీఆర్‌ఎస్ కూడా బీజేపీనే తమ ప్రత్యర్థి అన్నట్లుగా విమర్శల దాడి చేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఈ పరిస్థితిలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికలకు వెళ్తే.. అధిష్టానం బండినే సీఎం చేసే అవకాశం ఉంటుందన్న భావన సీనియర్లలో వ్యక్తమవుతోంది. దీంతో నాయకత్వం మార్చాలని పలువురు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రధానంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు నాయకత్వ మార్పును గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అమిత్‌షా ఆశీస్సులు పుష్కలంగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర నేతల డిమాండ్‌పై పునరాలోచనలో పడ్డారు. దీనిని అధిగమించే ప్రయత్నంలో విఫలం అవుతున్నారు.
ఎన్నికలకు వెళ్లే అంశం..
ఇక తెలంగాణ బీజేపీ ఎదుర్కొంటున్న మరో సవాల్ ఎన్నికలకు వెళ్లే ప్రధాన అంశం. కేవలం హిందుత్వం, కేసీఆర్ వ్యతిరేకత అజెండాగా ఎన్నికల్లోకి వెళితే గెలుపు సాధ్యం కాదు. ఈ విషయం కర్ణాటక ఎన్నికల తర్వాత స్పష్టమైంది. మరోవైపు హిందుత్వ అంశం ఉత్తరాదిన పనిచేసినట్లుగా దక్షిణాదిన ప్రభావం చూపదు. ఈ నేపథ్యంలో స్పష్టమైన ఎజెండాతో ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ముందుందని చెప్పవచ్చు. రైతులు, నిరోద్యోగులు, మహిళలు, బీసీలు, ఇలా ప్రత్యేక ఎజెండా రూపొందిస్తుంది. బీజేపీ మాత్రం ఇలాంటి ప్రయత్నం చేయడం లేదు.
సమన్వయ లోపం..
బీజేపీలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అధిష్టానం ఆదేశాలను కూడా కొంతమంది పాటించడం లేదు. అధినేతను లెక్క చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ. అయితే ఇప్పుడు సిద్ధాంతాల పరంగా కాకుండా అధికారమే లక్ష్యంగా వివిధ పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. అయితే వీరు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడంలేదు. ఎవరి ఎజెండా వారిది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామంతో సమన్వయం లోపిస్తోంది. ఇటీవల చిట్‌చాట్‌ల పేరుతో సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. గతంలో ఎవరూ ఇలా మాట్లాడేవారు కాదు. కొత్తగా పార్టీలో చేరిన వారే ఇలాంటి చిట్‌చాట్‌లకు తెర తీస్తున్నారు.
వ్యూహం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహం బీజేపీ వద్ద స్పష్టంగా లేదు. బీఆర్‌ఎస్ అధినేత ఇప్పటికే ఎన్నికల వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎలా అధిగమించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. సంక్షేమంతోనే ఓటర్లను బీఆర్‌ఎస్‌వైపు మళ్లించుకోవాలని చూస్తున్నారు. బీజేపీ మాత్రం స్పష్టమైన వ్యూహం ఇప్పటి వరకూ రూపొందించలేద. ఇదీ ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థులుగా భావిస్తున్నవారు ఎవరికి వారు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప పార్టీని గెలిపించే ప్రయత్నం చేయడం లేదు. పార్టీ రాష్ట్రశాఖ కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. మరోవైపు కేసీఆర్‌పై వ్యతిరేకతతో చేరినవారు బీజేపీ కేసీఆర్‌కు వ్యతిరేకమేనా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జాతీయస్థాయిలో కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా పనిచేస్తోంది. బీఆర్‌ఎస్ ముక్త్ తెలంగాణపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కేసీఆర్‌పై వ్యతిరేకతతో చేరిన నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బల నిరూపణ..
ఇక బీజేపీ తెలంగాణలో తాము బలమైన పార్టీగా ఎస్టాబ్లిష్ చేయలేకపోతోంది. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ, మునుగోడు ఎన్నికల ఫలితాల ఆధారంగా బీజేపీ అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అన్న నమ్మకం పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ బలహీన పడుతుందని ప్రజలు నమ్మారు. అయితే బీజేపీ దానిని నిలబెట్టుకోవడంలో, పెంచుకోవడంలో విఫలమవుతోంది. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ బలపడుతోంది. అయితే అది బీఆర్‌ఎస్‌ను ఓడించే స్థాయిలో ఉందా అనేదానిపై స్పష్టత లేదు. కానీ బీజేపీ మాత్రం అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించగలదన్న నమ్మకం కల్పించలేకపోతోంది.
కాంగ్రెస్ తరాహాలో పార్టీలో సమన్వయం పెంచడం, నాయత్వ సమస్యను త్వరగా పరిష్కరిచడం, స్పష్టమైన ఎజెంరూపొందించుకుని ప్రత్యేక వ్యూహరచన చేస్తేనే బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. లేని పక్షంలో మళ్లీ పాత కథే పునరావృతం అవుతుంది అనడంలో సందేహం లేదు.