AP BJP: ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సందర్శన బీజేపీకి బాగానే మైలేజ్ వచ్చింది. అటు ప్రాజెక్టుల పనుల పరిశీలనతో పాటు నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు కార్యక్రమం చక్కటి వేదికగా నిలిచింది. రాష్ట్ర బీజేపీ నేతలు ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమం నిర్వహించిన తీరు సర్వత్రా అభినందనలు అందుకుంది. శ్రీకాకుళం జిల్లా వంశధార ఫేజ్2 రిజర్వాయర్ నిర్మాణ పనుల పరిశీలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ నాయకులు పదునైన మాటలతో అటు అధికార పక్షం వైసీపీకి, గతంలో అధికారం వెలగబెట్టిన టీడీపీకి బాగానే ఇరుకున పెట్టారు. రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల మనసులను సైతం దోచుకున్నారు. అధికార, విపక్షాలను తూర్పారపడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కడిగిపారేశారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించిన ఆయన బీజేపీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలిగారు. తొలిరోజు సందర్శించిన పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో బీజేపీ నేతలకు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

గ్రౌండ్ లెవల్ లో బీజేపీకి మంచి ఆదరణ ఉందని గ్రహించిన నేతలు స్పీడ్ పెంచారు. హిరమండలంలోని వంశధార రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభకు వేలాది మంది నిర్వాసితులు, స్థానికులు నేతల ప్రసంగాలను ఆసాంతం విన్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ కు చేసిన సాయం గురించి సాదోహరణంగా వివరించినప్పుడు సభికుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. నాడు టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు చేసిన అన్యాయం, బలవంతంగా గ్రామాలు ఖాళీ చేయించిన తీరును తప్పుపట్టడమే కాకుండా.. ఎంతో నమ్మకంతో గెలిపించిన వైసీపీ వంచించిన తీరును వీర్రాజు ఎండగట్టారు.
Also Read: Rythu Bima: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఈ స్కీమ్ తో కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్!
బీజేపీపై ఉన్న అపవాదు ఒట్టిదేనని అక్కడకు వచ్చిన నిర్వాసితులు సంత్రుప్తి చెందేలా బీజేపీ నేతలు వారికి భరోసా కల్పించారు. అటు ఒడిశాతో వివాదాస్పదమైన వంశధార తీరమైన నేరడిని సోము వీర్రాజుతో పాటు బీజేపీ నాయకులు సందర్శించారు. ఒడిశాతో నెలకొన్న జల వివాదం, జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటిని నోటిఫై చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం ద్రుష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కార మార్గం చూపుతామని చెప్పడంతో స్థానికులకు ఎంతో నమ్మకం కుదిరింది. మూడు రోజుల పర్యటనలో తొలిరోజు సిక్కోలు వాసులకు భరోసా కల్పించడంలో సోము వీర్రాజు నేత్రుత్వంలోని బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు.
మాటల దాడి
రెండో రోజు పర్యటనలో భాగంగా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన గళాన్ని వినిపించారు. మంత్రివర్గ విస్తరణ, రాజకీయాలతో బిజీగా ఉన్న ప్రభుత్వ పెద్దలకు సెగ తాకేలా విమర్శల జడివాన కురిపించారు. తోటపల్లి, వట్టిగెడ్డ, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టుల పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తాజా మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ఫశ్రీవాణి తీరుపై విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి వెలగబెట్టి కనీసం రూ.10 లక్షల నిధులనైనా.. ప్రాజెక్టుల నిర్వహణకు మంజూరు చేయించుకున్నారా? అని ప్రశ్నించారు.

కేంద్రం అందించే ఉపాధి నిధులతో ఇంటిని నిర్మించుకున్నారంటూ స్థానికుల గొంతునై వీర్రాజు చేసిన కామెంట్స్ అటు తాజా మాజీ డిప్యూటీ సీఎంకు గట్టిగానే తగిలాయి. ఇటు స్థానికులు, గిరిజనుల అభిమానాన్ని చూరగొన్నాయి. తోటపల్లి ఆధునికీకరణ పనుల్లో జాప్యం, నిధుల కేటాయింపులో వివక్షను కూడా బీజేపీ నేతలు తప్పుపట్టారు. తాటిపూడి, తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుల స్థితిగతులను తెలుసుకున్న నాయకులు స్థానికులు, నిర్వాసితుల నుంచి వివరాలు సేకరించి నోట్ చేసుకున్నారు. కేంద్ర నాయకత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంతో పాటు శాసనమండలిలో ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ముప్పేట దాడి
ఉత్తరాంధ్ర ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్ట్ పై బీజేపీ నేతలు గట్టిగానే ఫోకస్ పెట్టారు. దివంగత వైఎస్ మానస పుత్రికగా ఉన్న ప్రాజెక్ట్ ను ఆయన కుమారుడు జగన్ ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు తెలియజెప్పేందుకు నిర్ణయించారు. అటు విశాఖకు తాగునీరందించే తాటిపూడి, మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ల దయనీయ పరిస్థితిని కళ్లారా చూసిన బీజేపీ నేతలు వాటిపై గట్టి పోరాటానికి నిర్ణయించారు. రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలన్న తరుణంలో, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సందర్శన బీజేపీకి జీవం పోసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇప్పటికే బీజేపీ సందర్శించిన ప్రాంతాలు, నియోజకవర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. దశాబ్దాల తరబడి సమస్యలు పరిష్కరించకుండా అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చిన టీడీపీ, వైసీపీ సర్కారుల పనితీరును స్థానికులు, నిర్వాసితులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ లోపాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా జిల్లాల బీజేపీ నాయకులు స్పీడు పెంచితే రాజకీయంగా మలుచుకోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.
[…] Cabinet Reshuffle In Andhra Pradesh: ఒక సీఎం, నలుగురు డిప్యూటీ సీఎంలు, 25 మంది మంత్రులు.. ముచ్చటగా మూడేళ్లు ఏలారు. మిగతా విప్ లు, చీప్ విప్ లు, కార్నోరేషన్ చైర్మన్లుగా కొనసాగేవారు. ఏ పదవి లేని మరో 100 మందికి పైగా ఎమ్మెల్యేలుగా కొనసాగేవారు. అలాగని ఇంతవరకూ పార్టీలో అసంత్రుప్తి లేదు. అధినేత మాటకు ఎదురులేదు. అయినా మంత్రివర్గం మొత్తాన్ని తప్పించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది. అనవసరంగా అగ్గితో తల గోక్కున్నట్టు ఈ నిర్ణయాలేమిటి? దీనిపై వచ్చే పర్యవసానాలేమిటి? అంటూ సగటు వైసీపీ అభిమానులు తెగ బాధపడుతున్నారట. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు.. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికే సవా లక్ష ప్రజా సమస్యలు ఏపీ నిండా ఉన్నాయి. ఒక వైపు కొత్త జిల్లాలు ప్రకటించారు. […]