Telangana BJP: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మరో పక్షం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. మే నెలలో ప్రస్తుత సభ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేసేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో పోలింగ్ నిర్వహించి, ఏప్రిల్ నెలాఖరుకు ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈమేరకు ఇప్పటికే మంత్రులను లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ఫిబ్రవరి 2 నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భావిస్తున్న రేవంత్, లోక్‌సభ ఎన్నికలకు కూడా ఇంద్రవెళ్లి నుంచే ప్రచారం ప్రారంభించబోతున్నారు.
బీజేపీ కూడా సిద్ధం..
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించేలా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్ణయించారు. జనవరి 28న ఉమ్మడి మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ, బిహార్ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడింది. ఫిబ్రవరి మొదటి వారంలో షా తెలంగాణకు వస్తారని తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ కూడా..
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు 9 మంది సభ్యులు ఉన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వాటిని అయినా నిలబెట్టుకోవాలి. లేదంటే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. ఇద్దరు ముగ్గురు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలో చేరుతారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సీట్లు గెలిచేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బీజేపీకే మెజారిటీ సీట్లు..
తెలంగాణలో మొత్తం 19 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ సీటు రెండు దశాబ్దాలుగా ఎంఐఎం ఖాతాలోనే పడుతోంది. 18 స్థానాల్లో మాత్రమే ఎంపీలు మారుతున్నారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రీపోల్ సర్వేలు జరుగుతున్నాయి. జాతీయ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇందులో చాలా వరకు తెలంగాణలో ఈసారి బీజేపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక ఎమ్మెల్యే స్థానం మాత్రమే గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు, సీట్లు పెరిగాయి. ఈసారి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఓట్లశాతం 16 శాతానికి పెరిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓట్ల శాతం 25 నుంచి 30 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ 8 నుంచి 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సమాచారం. మరో 2 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ 4 నుంచి 5 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్ 2 నుంచి 4 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. సర్వే ఫలితాలు నిజమైతే.. దక్షిణాదిపై పట్టుకోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు తెలంగాణలో ఫలించినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.