BJP vs TRS: వరి ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీని కార్నర్ చేసేందుకు వ్యూహం ప్రకారం టీఆర్ఎస్ ముందుకెళ్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ నేతలు రాష్ట్రస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుండగా, మరో వైపున ఆ పార్టీ మంత్రులు ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు పింక్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాగా, టీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చేందుకుగాను కమలనాథులు బయలుదేరారు. తాజాగా కేంద్ర హోం శాఖ అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలను పిలిచి మరీ టీఆర్ఎస్‌ను ఎలా కౌంటర్ చేయాలో దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణలో భారీ బియ్యం స్కాం జరిగిందని, దీనిపై త్వరలో చర్యలుంటాయని తెలిపారు కేంద్రమంత్రి. టీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కయి పెద్ద ఎత్తున బియ్యం సేకరణలో ఆక్రమాలకు పాల్పడ్డారని కొంత కాలం నుంచి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ఈ స్కాంకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయని, ఈ క్రమంలోనే కేసీఆర్‌పై పోరాటంలో వెనక్కి తగ్గొద్దని రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు.
ఇప్పటి వరకు బీజేపీని టార్గెట్ చేసి టీఆర్ఎస్ నేతలు రాజకీయం చేశారు. కాగా, తాజాగా అమిత్ షా మాటలతో ఇకపై టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు రాజకీయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ తెలంగాణ రాష్ట్రనేతలకు అమిత్ షా చెప్పారు. కేసీఆర్ అవినీతిపై పోరాడాలని ఈ సందర్భంగా నేతలకు అమిత్ షా తెలిపారు.
ధాన్యం కొనుగోళ్ల విషయమై బీజేపీని దోషిగా నిలబట్టే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోందని, దానిని తిప్పి కొట్టాలని సూచించినట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌పై చాలా గట్టిగా పోరాడాలని, అవసరమైన సహకారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి, పెద్దల నుంచి ఉంటుందని చెప్పకనే చెప్పారు.
Also Read: TRS vs BJP: ఆత్మగౌరవ నినాదం: కేంద్రం టార్గెట్.. మళ్లీ సెంటిమెంట్ రగిలిస్తున్న టీఆర్ఎస్
ఇక భవిష్యత్తులో బీజేపీ నేతలు ‘బియ్యం స్కాం’ తెరమీదకు తీసుకొచ్చి టీఆర్ఎస్‌ను కార్నర్ చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ రాజకీయ క్షేత్రంలో ఉండగా, అదే విషయమై కౌంటర్ ఇచ్చేందుకుగాను బీజేపీ నేతలు ‘బియ్యం స్కాం’ అంశంతో రాబోతున్నారు. మొత్తంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మరోసారి వెరీ టఫ్ ఫైట్ కొనసాగబోతున్నదని అర్థమవుతోంది. తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే ఈ స్కాం ద్వారా పార్టీకి రాజకీయంగా మరింత బలం చేకూరి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా అవతరించాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Kodurupaka Village: సాయంత్రం లేని తెలంగాణలోని ఈ ఊరి గురించి తెలుసా..?