Telangana Liberation Day: చాలా రోజుల తర్వాత రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. అంతకంటే ఒకరోజు ముందుగానే ప్రభుత్వ పెద్దలు మీడియాకు లీకులు ఇచ్చారు. ఇంతకు ఇచ్చిన అంశం ఏంటంటే తెలంగాణ సమైక్యతా దినోత్సవం మీద. అది కూడా సెప్టెంబర్ 15 నుంచి మొదలుపెట్టి ఏడాది పాటు నిర్వహిస్తారట! వాస్తవానికి భారత యూనియన్ లో తెలంగాణ కలిసి 74 ఏళ్లే అవుతోంది! కానీ 75 సంవత్సరంలోకి అడుగు పెట్టకముందే హడావుడిగా సమైక్యతా వజ్రోత్సవాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. నిజానికి సెప్టెంబర్ 17 వస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో విమోచనం, విలీనం, విద్రోహం, విముక్తి అనే పదాలతో రకరకాల కథనాలు వ్యాప్తిలోకి వస్తాయి. మీడియా కూడా కోడై కూస్తుంది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించారంటూ పలుమార్లు ప్రశ్నించిన కేసీఆర్.. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించారు. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం తన జాన్ జిగ్రీ దోస్త్ ఎంఐఎం కు ఇష్టం ఉండదు. అందుకే కేసీఆర్ కూడా దాన్ని పట్టించుకోడు. పైగా ఎవరైనా విమోచన దినోత్సవం నిర్వహించాలని బలంగా అంటే పచ్చని తెలంగాణలో మత నిప్పులు పోస్తారా అని అధికార మీడియా ఎదురుదాడి చేస్తుంది. పైగా నిజాం పాలన అంటే కెసిఆర్ కు ఎనలేని ఇష్టం. ఇదే కేసీఆర్ కొడుకు కేటీఆర్ తన తాత కేశవరావు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడాడని ట్విట్టర్లో పోస్ట్ చేస్తాడు. తండ్రిది ఆ రూటు, కొడుకుది ఈ రూటు.. మధ్యలో జనాలే పిచ్చివాళ్లు. అంతిమంగా నెరవేరేది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు!

అకస్మాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చింది
ఈమధ్య పదే పదే కేసీఆర్ మోదీ ని గోకుతా అంటున్నాడు. కానీ బిజెపి నాయకులు మాత్రం గోకే చూపిస్తున్నారు. వికారాబాద్ మీటింగ్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కేసీఆర్ కు కవిత లిక్కర్ స్కాం రూపంలో బిజెపి నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులాగానే వ్యవహారం సాగుతోంది. సందు దొరికితే చాలు టిఆర్ఎస్, మజ్లీస్ పార్టీల మైత్రిని ఎండగట్టే బిజెపి.. ఈసారి తెలంగాణ విమోచన దినోత్సవం మీద దృష్టి సారించింది.
Also Read: KCR Vs BJP: బీజేపీకి భయపడ్డ కేసీఆర్.. ఇదే సాక్ష్యం!
అప్పట్లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ యూనియన్ లో ఉండేవి. ఎప్పుడైతే సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో నిజాం నవాబు లొంగి పోయాడో అప్పుడే ఆయా ప్రాంతాలు ఆయా రాష్ట్రాల్లో విలీనమయ్యాయి. అటు కర్ణాటకలో, ఇటు మహారాష్ట్రలో విమోచన దినోత్సవాలు ఘనంగానే జరుగుతాయి. ఎటొచ్చీ తెలంగాణలోనే ఏమీ ఉండదు. అయితే దీనిని ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని, ప్రజల్లో సెంటిమెంట్ ను రగల్చాలని బిజెపి ప్లాన్. అందుకే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని హైదరాబాదులో భారీగా నిర్వహించి, అమిత్ షా ను, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే లను పిలిచి కెసిఆర్ ను గోకేందుకు బిజెపి పక్కాగా ప్లాన్ వేసింది. ఈ సమావేశానికి అనుమతులు ఇవ్వకుండా కేసీఆర్ ఉండలేడు.

పైగా అది తెలంగాణకు సంబంధించిన విషయం. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ప్రజల్లో వ్యతిరేక భావన వ్యక్తం అవుతుంది. దీన్నే గ్రహించిన కేసీఆర్.. హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణ ఒక్కటే ఉండిపోయింది కాబట్టి, 74 ఏళ్ల క్రితమే అస్తిత్వ పోరాటం చేసి తెలంగాణలో వీలైనంత కాబట్టి.. తెరపైకి వజ్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇటీవల స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహించి, కేంద్రానికి అజాదీ కా అమృతోత్సవం ఫలం దక్కనీయలేదు. నిజానికి హర్ ఘర్ తిరంగా అనేది ఆజాదీ కా లో భాగమే. ఇప్పుడు విమోచన దినోత్సవం పైనా అంతే! బిజెపికి ఎట్టి పరిస్థితుల్లోనూ మైలేజ్ రావద్దని కెసిఆర్ ప్లాన్. అందుకే తెరపైకి వజ్రోత్సవాలను తీసుకొచ్చారు. కాకపోతే ఇందులో తెలంగాణ పోరాటం, తెలంగాణ అస్తిత్వం .. ఇలాంటి కొన్ని కొన్ని పదాలు వాడే కార్యక్రమాన్ని ముగిస్తారు. అంతేతప్ప నిజాం పాలనను పల్లెత్తు మాట కూడా అనరు. లేస్తే బిజెపిని మత పార్టీ అని దునుమాడే కెసిఆర్.. ఇట్లాంటి విషయాల్లో ఆయన ఏం చేస్తున్నదేంటని అడిగితే సమాధానం ఉండదు. ఇక ఈ విషయంలో అన్నిటికంటే భిన్నంగా అనిపించింది ఎంఐఎం స్టాండ్. జాతీయ గీతాన్ని ఆలపించను అన్న వాళ్ళ నోటితోనే ఇప్పుడు సెప్టెంబర్ 17న పాత బస్తీలో తిరంగా ర్యాలీ జరుగుతున్నది. అది కూడా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో.. కానీ ఈ విషయంలో ఎటొచ్చీ నిశ్శబ్దంగా ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీనే! పాపం ఇప్పుడు దాని పరిస్థితి జాతీయ స్థాయిలోనే బాగోలేదు. ఇక తెలంగాణలో మాత్రం ఏం చేస్తుంది.. సెప్టెంబర్ 17 పుణ్యమా అని బిజెపి ఇటు కేసీఆర్ ను, అటు ఎంఐఎంను బాగానే ఇరకాటంలో పెట్టింది. కెసిఆర్ పరిభాషలో చెప్పాలంటే ఒక్క గోకుడుకు రెండు పిట్టలన్నమాట!
Also Read:Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే జగన్ సర్కార్ తట్టుకుంటుందా?