ప్రొద్దుటూరు లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సూచనల మేరకే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిన్న సాయంత్రం బీజేపీ కార్యకర్తలపై దాడి వైసీపీ ఎమ్మెల్యే చేయించినవేనని ఆరోపించారు. ఎమ్మెల్యే రాచమల్లుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేస్తామని విష్ణు స్పష్టం చేశారు. ఎంత మందిని చంపుతావో చంపు, ధైర్యంగా పోరాడుతామన్నారు. ప్రొద్దుటూరులో ఐపిసి సెక్షన్ కాకుండా వైసిపి సెక్షన్ నడుస్తోందన్నారు. ఇదే విషయంపై జిల్లా ఎస్పీ అన్బు రాజన్ కి ఫిర్యాదు చేసామన్నారు.
ఈ బీజేపీ కార్యకర్తలు కొన్ని రోజుల క్రితం వైసిపి నుంచి బీజేపీ లోకి చేరారని, తిరిగి వైసీపీలోకి రావాలని ఒత్తిడికి దిగి ప్రభుత్వం పథకాలు రానివ్వకుండా చేశారని విష్ణు ఆరోపించారు. ప్రభుత్వ పథకాలపై ఉన్నతాధికారులికి ఫిర్యాదు చేయడంతో స్థానిక వలంటీర్ తొ కలిసి బీజేపీ కార్యకర్తల పై దారుణంగా దాడులు చేయించారని మండిపడ్డారు. ఈ దాడుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని.. కడప రిమ్స్ హాస్పిటల్ లో వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఘర్షణకు పాల్పడ్డ వారిపై ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోగా తిరిగి బాధితుల పై కేస్ పెట్టడం దారుణమని విష్ణు ఆక్షేపించారు.
నిన్న సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన కొన్ని గంటల్లోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు జరగడం దారుణమని విష్ణు అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బెదిరింపులు కు దిగిన కొన్ని గంటల్లోనే ఎవరో ఒకరిపై దాడులు, హత్య జరుగుతుందని.. ఇదంతా పథకం ప్రకారమే చేస్తున్నారన్నారు. నందం సుబ్బయ్య హత్య కూడా ఇలాగే జరిగిందన్నారు. దీనిపై ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ఒక వీధి రౌడీ లాగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి భయపడి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలంగాణకి వెళ్లిపోయాడని విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? ఎమ్మెల్యే రాజ్యాంగం లో నడుస్తుందా? అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో బీజేపీ కార్యకర్తలు పై జరిగిన దాడిపై నిస్పక్షపాతంగా విచారణ జరిగి బాధితులకు న్యాయం చేయాలని విష్ణు డిమాండ్ చేశారు.