Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. పాదయాత్రకు అడుగడుగునా అంతరాయం సృష్టించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తుండటంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది. మూడు రాజధానుల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవుతోంది.

అయితే మొదటి నుంచి బీజేపీ నాయకులు పాదయాత్రకు మద్దతు తెలపకపోయినా దానిపై విమర్శలు చేశారు. దీంతో ఇటీవల తిరుపతిలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతుల పక్షాన నిలవాల్సిన అవసరం నొక్కి చెప్పారని తెలిసింది. ఈ క్రమంలో పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ఈ నెల 21న పాదయాత్రలో పాల్గొని మద్దతు ప్రకటిస్తారని తెలిసింది. దీంతో రాష్ర్టంలో రైతుల పక్షాన నిలబడి వారికి మద్దతు తెలుపుతూ వారి వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అమిత్ షా ఇచ్చిన సూచనతోనే రాష్ర్ట బీజేపీ నేతలు రైతుల పక్షాన నిలబడేందుకు తీర్మానించుకున్నట్లు సమాచారం.
Also Read: KCR: కేసీఆర్ కేంద్రానికి నిజంగా భయపడడం లేదా..?
బీజేపీ అధిష్టానం ఇచ్చిన సూచన మేరకే రైతులకు అండగా నిలిచి పాదయాత్ర విజయవంతం కోసం వారితో కలిసేందుకు సిద్ధమయ్యారు. గతంలో పాదయాత్రపై విమర్శలు చేసిన నేతలు అధిష్టానం నిర్ణయం మేరకు సమస్య పరిష్కారానికి సంఘీభావం ప్రకటించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఇచ్చిన జోష్ తో పాదయాత్ర మరింత ఉత్సాహంగా ముందుకు సాగనున్నట్లు సమాచారం.