కరీంనగర్ జిల్లాలో విచ్చలవిడిగా గ్రానైట్ వ్యాపారం కొనసాగుతోంది. కొండలను పిండి చేస్తూ అందినంత దోచుకుంటూ జిల్లాను ఎడారిగా మారుస్తున్నారని ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గ్రానైట్ వ్యాపారంతో కోట్లు కొల్లగొడుతూ పన్నులు మాత్రం ఎగవేస్తున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. గ్రానైట్ కంపెనీలకు షాకిచ్చింది. గ్రానైట్ వ్యాపారంలో మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన శ్వేతా ఎంటర్ ప్రైజెస్ ప్రముఖంగా ఉంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారంలో మంత్రికి పట్టు ఉందని తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలను టార్గెట్ చేసుకుని ఆయనను ఓడించేందుకు మంత్రి గంగుల తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న బీజేపీ ఆయనకు చెక్ పెట్టేందుకే గ్రానైట్ కంపెనీలపై ప్రముఖంగా గురిపెట్టినట్లు సమాచారం. గ్రానైట్ వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేస్తూ విచ్చలవిడిగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా పలుమార్లు గ్రానైట్ పై అనేక ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్వేత ఏజెన్సీస్ తో పాటు మరిన్ని సంస్థలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ఏళ్లుగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, రాయల్టీ ఎగవేస్తున్నాయని తెలుస్తోంది. గ్రానైట్ వ్యాపారంలో మోసాలపై గతంలోనే విజిలెన్స్ దాడులు జరిగాయి. నిర్దేశించిన ప్రమాణాలు కాకుండా తమకు తోచిన విధంగా విదేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి 2013లోనే ఆయా కంపెనీలకు రూ.750 కోట్ల మేర జరిమానా విధించినా రూ.11 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఈడీకి ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం ఓడ రేవుల మీదుగా గ్రానైట్ విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఇందులో ఎంతమేర వ్యాపారం కొనసాగుతుందనే దానిపై విచారణ చేపడుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రి గంగుల కమలాకర్ తనపై వేసుకుని నిర్వహిస్తున్నందునే బీజేపీ గంగులపై ప్రత్యేక దృష్టి సారించి ఆయన వ్యాపారాలపై ఓ కన్నేసి వాటిని నిలువరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.